Rains In Andhra Pradesh and Telangana : రాష్ట్రంలో పలు చోట్ల వానలు దంచికొట్టాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి ఈరోజు (శనివారం) ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రాత్రంతా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రభుత్వ కార్యాలయాలు పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయం, ప్రభుత్వ గ్రంథాలయం కార్యాలయాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లోని చెరువులు వర్షం నీటితో నిండిపోయాయి. ఈ ఏడాది కురిసిన వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావులలో నీరు సమృద్ధిగా వస్తున్నట్లు రైతులు తెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షంతో రాయదుర్గం మండలంలో 75.6 మి.మి, కనేకల్ 54.0 మి.మి, డి. హీరేహాల్లో 59.8 మి.మి, బొమ్మనహాల్ 31.4 మి.మి, గుమ్మగట్టలో మండలాల్లో 36.2 మి.మి వర్షపాతం నమోదైంది.
ఆదోనిలో భారీ వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Heavy Rains In Kurnool District
అలాగే నిన్న(శుక్రవారం) కర్నూలు జిల్లా ఆదోనిలో అధిక మోతాదులో వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీటితో పాటు ప్రధాన రహదారులు పూర్తిగా నీటితో నిండాయి. వర్ష ప్రభావానికి వాహనాలన్నీ నిలిచిపోయాయి. వర్ష తీవ్రతకు వాహన, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.