RRB NTPC Jobs Notification 2024 : ఎక్కువ మంది నిరుద్యోగులు ఆసక్తి చూపించే కొలువుల్లో రైల్వే జాబ్స్ ముఖ్యమైనవి. అందులోనూ ఆ శాఖ భర్తీ చేసే ఎన్‌టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) పోస్టులకు పోటీ, ప్రాధాన్యం రెండూ హై లెవల్‌లో ఉంటాయి. అలాంటి పోస్టుల భర్తీకి రైల్వే శాఖ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏకంగా 8113 ఖాళీలను భర్తీ చేయనుంది. అందులో 1,736 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు, 994 స్టేషన్ మాస్టర్, 3,144 గూడ్స్ ట్రైన్ మేనేజర్, 1,507 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, 732 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి.
జీతం ఎంత ఉంటుందంటే : ఈ ఉద్యోగాల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్ కొలువులు రెండు లెవెల్-6 జాబ్స్. వీరికి ప్రారంభ మూలవేతనం రూ.35,400 దక్కుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మిగతా అలవెన్సులన్నీ కలిపి మొదటి నెల నుంచే కనీసం రూ.65 వేల వరకు వేతనం అందుకోవచ్చు. మిగతావి లెవెల్-5 జాబ్స్. వీరికి మూల వేతనం రూ.29,200 లభించనుండగా, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలిపి రూ.55 వేల జీతం చేతికొస్తుంది.
ఎలా ఎంపిక చేస్తారంటే? పైన చెప్పిన అన్ని పోస్టులకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉంటుంది. ఒకవేళ మీరు స్టేషన్ మాస్టర్ పోస్టుకు అప్లై చేసి ఉంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ) అదనంగా రాయాల్సి ఉంటుంది. అలాగే టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ (టీఎస్‌టీ) ఉంటుంది. వీటిల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ నిర్వహించి నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఏదైనా డిగ్రీ ఉంటే చాలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారు ఏదైనా డిగ్రీ పట్టా పొంది ఉంటే చాలు. జనవరి 1 2025 నాటికి 18 - 36 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయసు మినహాయింపు ఇస్తారు.