Purandeshwari Road Show :ఎన్నికలు దగ్గరపడటంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. కూటమి ప్రకటింటిన మేనిఫెస్టోని అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. రోడ్‌షోలో పురందేశ్వరితో పాటు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఇరువురు నేతలు నిడదవోలు, పెరవలి మండలాలలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో ప్రారంభమైన రోడ్‌షో రావి మెట్ల, తాడిమళ్ల, తిమ్మరాజుపాలెం మీదుగా కడింపాడు వరకు కొనసాగింది.
కూటమి మేనిఫెస్టోతో జోరుగా ప్రచారం - వైఎస్సార్సీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు
ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు :ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. దానిని నిరసిస్తూనే ప్రజలు ఈ రక్షాస ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.బ్లేడ్ బ్యాచ్‌లకు, మాఫియా దందాలకు రాజమహేంద్రవరం పెట్టింది పేరని పురందేశ్వరి ఎద్దేవా చేశారు. ఇక్కడ జరుగుతున్న ఇసుక మాఫియా వల్ల ఇసుక ధరలు పెరిగిపోయి నిర్మాణ రంగంమీద ఆధారపడి బతుకుతున్న 35 లక్షల మంది రోడ్డున పడ్డారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో అన్ని రకాల సమస్యలు గుర్తించామని తెలిపారు. వీటన్నింటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు.