ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాతి ఎఫెక్ట్ : ఆర్టీసీ బస్సుల్లో దొరకని సీట్లు! - దోచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ - PRIVATE TRAVELS CHARGES

సెలవులకు సొంతూరుకి వెళ్లే ప్రయాణికులకు తప్పని అవస్థలు - ఆర్టీసీ రెగ్యులర్, ప్రత్యేక సర్వీసుల్లో సిట్లన్నీ ఫుల్​

Private Travels Charges on Sankranti festival
Private Travels Charges on Sankranti festival (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 7:09 AM IST

Private Travels Charges on Sankranti festival : సంక్రాంతికి సొంతూరు వచ్చే రాష్ట్రవాసులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. ఆర్టీసీ రెగ్యులర్, ప్రత్యేక సర్వీసుల్లో సీట్లు నిండిపోగా ప్రైవేటు ట్రావెల్స్‌ టికెట్‌ రేట్లు అందినకాడికి పెంచేసి నిలువు దోపిడీ చేస్తున్నాయి. వెబ్ సైట్లు, యాప్‌ల ద్వారానే ఈ దందా జరుగుతున్నా రవాణాశాఖ అధికారులకు పట్టడంలేదు.

సంక్రాతి ఎఫెక్ట్ : ఆర్టీసీ బస్సుల్లో దొరకని సీట్లు! - దోచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ (ETV Bharat)

ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతికి సొంతూళ్లకు పయమనవుతారు. హైదరాబాద్ నుంచే ఏపీకి లక్షల్లో తరలివస్తారు. ఇందులో నెల ముందే కొందరు టికెట్లు రిజర్వేషన్ చేసేసుకున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు 2,400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వీటిలో సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 9 నుంచి 13 వరకూ పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. ఐతే ప్రత్యేక బస్సుల్లో కొన్నింటికి మాత్రమే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.

వాహనదారులకు టోల్​ మోత - రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ కట్టాల్సిందే

టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ : సాధారణ ఛార్జీలు వసూలు చేయడం సహా రాను పోను టికెట్ బుక్ చేసుకున్న వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇస్తుండటంతో సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ , విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అన్ని బస్సు సర్వీసుల్లో టికెట్ బుకింగ్‌లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచే కాదు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్లోనూ సీట్లు లభించడం లేదు. పండుగ తర్వాత తిరుగుప్రయాణంలోనూ ఇదే పరిస్థితి. ప్రత్యేక బస్సులన్నింట్లోముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించక పోవడంతో సీట్లు లభిస్తాయో లేదోనని సంశయంలో ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

భారీగా పెరిగిన టికెట్‌ ధరలు : మరోవైపు సంక్రాంతికి రైల్వేశాఖ సైతం అరకొరగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో ప్రయాణికుల అవసరలాను అవి తీర్చలేకపోతున్నాయి. ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలోనూ ఇప్పటికే వెయిటింగ్ లిస్టు పెరిగిపోతోంది. బస్సులు, రైళ్లలో సీట్లపై ఆశలు వదులుకున్న కొందరు ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ వైపు వెళ్తున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతో ట్రావెల్స్ వారు టికెట్‌ ధరలను భారీగా పెంచేశారు. కొన్ని రూట్లలో రెండింతలు, మూడింతలు ఛార్జీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు యాప్ లు, వెబ్ సైట్లలో ఛార్జీల బాదుడు బహిరంగంగానే కనిపిస్తున్నా రవాణా శాఖ అధికారులు నియంత్రించడంలేదు. కొందరు ప్రయాణికులు RTA అధికారులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌ దందాపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝలిపించి నిర్ణీత ఛార్జీలు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రయాణికులకు ఏపీఎస్​ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు

జీఎస్టీ నుంచి ఎఫ్‌డీ రూల్స్‌ వరకు - జనవరి 1 నుంచి వచ్చే కీలక ఆర్థిక మార్పులు ఇవే!

ABOUT THE AUTHOR

...view details