Pratidwani :రెండంటే రెండు రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలు వేలాదిమంది జీవితాల్ని తలకిందులు చేశాయి. గ్రామాలకు గ్రామాలే ఆనవాళ్లు లేకుండా పోయాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గాయపడిన వారి సంఖ్య 200 దాటింది. మరెంతో మంది ఆచూకీ తెలియరావడం లేదు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పడిన కుండపోత వాన, బురద, బండరాళ్లతో కలసి ముంచేసిన వరద కేరళ వయనాడ్‌లో సృష్టించిన విధ్వంసం ఇది. కేరళలో వరదల విలయం ఇదే మొదటిసారి కాకపోవచ్చు. కొండప్రాంతాల్లోనే తరచు ఎందుకీ వరస విషాదాలు? ప్రకృతి ప్రకోపం కారణంగా జరిగే వాటిని ఎవరూ అడ్డుకోలేరు. కానీ మానవ తప్పిదాల మాటేంటి? విపత్తు నిర్వహణలో వయనాడ్ వరదలు ఎలాంటి గుణపాఠం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. నేటి చర్చల్లో విజయవాడకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ టీ శ్రీ కుమార్, హైదరాబాద్కు చెందిన ఓయూ సివిల్ ఇంజీనీరింగ్ విభాగం ప్రొ. గోపాల్ నాయక్ పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
కేరళ విషాదంలో 287 మృత్యువాత - వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక గాంధి - Wayanad Landslide
ప్రకృతి ప్రకోపిస్తే, వాన చినుకు విలయం సృష్టిస్తే, కొండలు అమాంతం కదిలొస్తే కట్టుకున్న ఇళ్లను ఉన్నపళంగా కబళిస్తే ఇలాంటి ఊహ మదిలో మెదలితేనే గుండె జల్లుమంటుంది. కేరళలో మాత్రం రాత్రికి రాత్రే ఇవన్నీ జరిగాయి. అప్పటివరకు నిశ్చింతగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయ నాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఊడ్చుకుంటూ వెళ్లాయి. వందల ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలో ఊళ్లను మరుభూముల్లా మార్చాయి.