ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో వెలుగులు - ఏపీలో చీకట్లు - విద్యుత్‌ రంగంలో ఆంధ్రావని వెనకబాటు

Power Cuts in YSRCP Government: తాబేలు, కుందేలు కథ గుర్తుందా? రేసులో కుందేలు అతివిశ్వాసంతో తాపీగా కూర్చుంటే తాబేలు వెనుకబడిపోతాననే భయంతో విశ్రాంతి తీసుకోకుండా గమ్యం చేరుతుంది. విద్యుత్‌ రంగంలో తెలుగు రాష్ట్రాలది ఇప్పుడు అదే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచుకుని నిరంతర వెలుగులు విరజిమ్ముతుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆంధ్రావనిని అంధకారంలోకి నెట్టేస్తోంది. నాణ్యమైన విద్యుత్ అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ఏటా బిల్లుల వాతలు, కరెంటు కోతలతో జనానికి ఉక్కపోయిస్తున్నారు. వేసవి వస్తుందంటనే ఏపీ ప్రజలు భయపడే పరిస్థితిలోకి నెట్టారు.

Power_Cuts_in_YSRCP_Government
Power_Cuts_in_YSRCP_Government

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 9:21 AM IST

తెలంగాణలో వెలుగులు - ఏపీలో చీకట్లు - విద్యుత్‌ రంగంలో ఆంధ్రావని వెనకబాటు

Power Cuts in YSRCP Government : నరసాపురం ప్రభుత్వాస్పత్రిలో జగన్‌ ఏలుబడిలో ఏర్పాటు చేసిన బోర్డులో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు వాడకండని అందులో రాశారు. జనం వినరనుకున్నారో ఏమోగానీ అవసరానికి కూడా వాడే అవకాశం లేకుండా అనేక సార్లు కరెంటు కోతలు పెట్టారు. ఉక్కపోతకు గురైన రోగులు, గుక్కపట్టి ఏడ్చిన పసిబిడ్డలే ఈ చీకటిపాలనకు సాక్షి! పొరుగున్న తెలంగాణలో ఒక్కరోజూ ఇలాంటి పరిస్థితి దాపురించలేదు.

సబ్‌స్టేషన్‌ ముందు జాగారం :జగనన్న కరెంటు కోతలకు ఉక్కిరిబిక్కిరై గ్రామస్థులంతా రోడ్డెక్కుతున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఊరుఊరంతా సబ్‌స్టేషన్‌ ముందు జాగారం చేయాల్సి వచ్చింది. తెలంగాణలో ఒక్క గృహవినియోగదారుడికీ ఇలాంటి కాలరాత్రి ఎదురుకాలేదు.

కరెంటు కోతలతో గుండెమండిన రైతు ఆక్రోశం :అనంతపురం జిల్లాలోని రైతులు విద్యుత్ అధికారుల కార్యాలయాలకు తాళాలు వేసిన ఉదంతాలు వైఎస్సారస్సీపీ పాలనలో చూశాం. తెలంగాణలో సాగుకు కరెంటు ఆగిపోయిన సందర్భాలే లేవు.

చిన్న పరిశ్రమ యజమానికి ఎదురైన కష్టం :తెలుగుదేశం హయాంలో పవర్‌ హాలిడే అనే పదమే వినిపించలేదు. కానీ..వైకాపా పాలనలో మళ్లీ అది అమలైంది. కానీ తెలంగాణలో ఏనాడూ పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించలేదు.

వేసవి రాక ముందే మొదలైన కరెంటు కష్టాలు - మరోవైపు గిర్రున తిరుగుతున్న స్మార్ట్‌ మీటర్లు

Andhra Pradesh V/S Telangana :ఇలా గత ఐదేళ్లలో జగన్‌ కరెంటు కోతలకు ఏపీలో విలవిల్లాడని రంగమంటూ లేదు. పొరుగున్న తెలంగాణ విద్యుత్‌ రంగంలో పురోగమిస్తోంటే జగన్‌ చేతగానితనంతో ఏపీ విద్యుత్‌ రంగం తిరోగమిస్తోంది. లోటు విద్యుత్‌ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో నిరంతర విద్యుత్‌ అందుతుంటే మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించిన ఏపీ పరిస్థితి రివర్స్ అయింది.

తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో జనం విద్యుత్‌ కోతలే చవిచూడలేదు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే చీకటి రాత్రులు గడపాల్సి వచ్చింది! కోతలు పెట్టని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ఛార్జీల భారం మోపలేదు. సర్దుబాటు ఛార్జీల పేరుతో వీర బాదుడు బాదేసిన జగనన్న మాత్రం వరుసగా మూడేళ్లు అంటే 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో కోతలు విధించారు.

తెలంగాణ విద్యుత్ నియంత్రణా మండలి కూడా అక్కడి ప్రజల నుంచి ట్రూ అప్‌ పేరిట 12వేల 500 కోట్లు పిండుకోవాలని ఆదేశించింది. కానీ అక్కడి ప్రభుత్వం ప్రజల జోలికి పోకుండా, ఆ భారాన్ని భరించింది. తెలంగాణలో ఇటీవలే అధికారంలోకొచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ కూడా కోటి 5 లక్షల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత కరెంట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. డిస్కంల పనితీరు, వినియోగదారులకు అందిస్తున్న సేవలను విశ్లేషించి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తెలంగాణ డిస్కంలకు ఏ గ్రేడ్ ఇవ్వగా ఏపీకి చెందిన CPDCL బీ ప్లస్‌ గ్రేడ్‌తో SPDCL బీ గ్రేడ్‌తో సరిపెట్టుకున్నాయి. తెలంగాణతో పోల్చితే ఏపీ డిస్కంల సేవలు దిగజారాయనడానికి ఇంతకుమించి నిదర్శనం ఏముంటుంది.

విద్యుత్‌ రంగంలో తెలంగాణ వేసిన వ్యూహాత్మక అడుగులే.. ఆ రాష్ట్రాన్ని వెలుగులబాటలో తీసుకెళ్తున్నాయి. అదే ఏపీకొచ్చేసరికి వైఎస్సార్సీపీ సర్కార్‌కు ముందస్తు వ్యూహం కొరవడింది. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 3వేల 820 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఏపీప్రభుత్వం వివిధ సంస్థలతో స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల డిమాండ్‌ తగ్గిన సందర్భంలో మిగులు విద్యుత్‌ను తక్కువ ధరకే మార్కెట్‌లో విక్రయించాల్సి వస్తోంది. డిమాండ్‌ పెరిగిన సమయంలో మాత్రం డిస్కంలు డబ్బు పట్టుకెళ్లి విద్యుత్‌ ఎక్ఛేంజీల ఎదుట ప్రజాధనం వెదజల్లుతున్నాయి.

పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రజలు ఆగ్రహం - ట్రూఅప్‌ ఛార్జీలు ఎత్తివేయాలని డిమాండ్

కానీ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘ, స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటోంది. 2024 వేసవిలో డిమాండు విపరీతంగా పెరిగినా నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలతో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. వందల కోట్లు వెచ్చించి విద్యుత్‌ కొనకుండా చేబదులు విధానాన్ని ఎంచుకుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో కూడా రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి ఇలాగే ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని అనుసరించింది.! తద్వారా ఆర్థికభారం తగ్గించుకుంది.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుదుత్పత్తి కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఒకే స్థలంలో అత్యంత ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న థర్మల్‌ కేంద్రం ఇదే. ఈ ఏడాది చివరికల్లా మొదటి యూనిట్‌లో ఉత్పత్తి అందుబాటులోకి రానుంది.

బయ్యారంలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌. ఇక్కడ కరెంటు ఉత్పత్తి కూడా మొదలైంది. ఇక కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 48 నెలల రికార్డు సమయంలో ప్లాంట్‌ అందుబాటులోకి తెచ్చారు.ఇటీవల వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌ కూడా వచ్చే పదేళ్లలో తలెత్తే డిమాండుకు సరిపడా విద్యుదుత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మించాలని సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ జెన్‌కో తరపున సొంతంగా మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని రామగుండంలో నిర్మించాలనే ప్రతిపాదననూ ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

వైఎస్సార్సీపీ సర్కార్‌ విద్యుదుత్పత్తికి ఆపసోపాలు పడుతోంది. రాష్ట్రంలోపంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటును జగన్‌ ప్రభుత్వం అస్మదీయ సంస్థలైన అదానీ, షిర్డీసాయి, అరబిందో కంపెనీలకు కట్టబెట్టింది. 39 ప్రాంతాల్లో 42 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం గుర్తించింది. అందులో 20 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను వివిధ సంస్థలకు కేటాయించింది. గ్రిడ్‌ స్థిరత్వం కోసం ఎగువ సీలేరు దగ్గర 1,350 మెగావాట్ల పంప్ట్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టును ఏజీ జెన్‌కో చేపట్టనుంది. గ్రిడ్‌ బేస్‌లోడ్‌కు ఉపయోగపడే ఒక్క థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కూడా నిర్మించలేదు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తైన 800 మెగావాట్ల కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ పూర్తిచేయడానికే నాలుగేళ్లు తీసుకున్నారు. VTPSలో మరో 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటును 2023 డిసెంబరులో అందుబాటులోకి తెచ్చారు. ఆ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినా గ్రిడ్‌ బేస్‌లోడ్‌ సరిపోయే పరిస్థితి లేదు. ఈ దృష్ట్యా సెంబ్‌ కార్ప్‌ నుంచి యూనిట్‌కు 5 రూపాయల 72పైసల వంతున.. 625 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది.

రాష్ట్ర విభజన తర్వాత పోలవరంలో 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో 12 యూనిట్ల ప్లాంట్లను జెన్‌కో నిర్మిస్తోంది. ఇందులోని ఒక్కో యూనిట్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 80 మెగావాట్లు. 2024-25లో మొదటి 7 యూనిట్లను, 2025-26లో మిగిలిన యూనిట్లను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏపీలో స్థాపిత విద్యుత్‌ సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్‌ వాటా 40 శాతం వరకూ ఉంది. ప్రస్తుతం సౌర విద్యుత్‌ ద్వారా 4వేల287 మెగావాట్లు, పవన విద్యుత్‌ నుంచి 4వేల 84 మెగావాట్లు, ఇతర పునరుత్పాదక వనరుల ద్వారా 521 మెగావాట్ల విద్యుత్‌ అందుతోంది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-సెకితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే మూడేళ్లలో 7 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ సమకూరనుంది. అది కూడా కలిపితే స్థాపిత విద్యుత్‌ సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్‌ వాటా 50 శాతం మించిపోతోంది. దీనివల్ల.. గ్రిడ్‌ నియంత్రణ సమస్యగా మారే అవకాశం ఉంది.

రాష్ట్రంలో వేసవి కోతల ప్రభావం జగన్‌పై మాత్రం పడలేదు.! ఏపీ రాజధాని అమరావతి ఉన్న ప్రాంతం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ- APCPDCLపరిధిలోకి వస్తుంది. ఐతే జగన్‌ నివాసానికి ప్రత్యేక విద్యుత్‌ లైన్లు, సరఫరా వ్యవస్థ ఉంది. సీఎం ఇంటికీ సాధారణ ఫీడర్‌ ద్వారా కనెక్షన్‌ ఇచ్చి ఉంటే ఆయనకూ కరెంటు కష్టాలు తెలిసేవి. రాజధాని ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా చేసే ఫీడర్‌ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో సగటున 103.86, గ్రామీణ ప్రాంతాల్లో 109.6 సార్లు 2022-23లో విద్యుత్‌ కోతలను విధించినట్లు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.

పొరుగునున్న తమిళనాడులో 10.71 సార్లు, తెలంగాణ దక్షిణ డిస్కం పరిధిలో 31.35 సార్లు విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడ్డాయి. జగన్‌ కార్యనిర్వాహక రాజధాని అంటూ కలవరిస్తున్న విశాఖలోనూ APతూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటున 225సార్లు, పట్టణ ప్రాంతాల్లో 79సార్లు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం

ABOUT THE AUTHOR

...view details