Chillakallu Gold Theft Case : అన్నం పెట్టిన ఇళ్లకే కన్నం వేస్తున్నారు కొందరు. యజమాని దగ్గర నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచుతున్నారు. అదను చూసి అందిన కాడికి దోచుకుపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద ఆరు కోట్ల విలువ చేసే బంగారం ఆభరణాలతో పరారైన డ్రైవర్ జిత్తు ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నందిగామ ఏసీపీ ఆధ్వర్యంలో సీఐ లచ్చినాయుడు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలోనే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కాల్‌డేటాను సేకరించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు డ్రైవర్‌తోపాటు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించి పలు వివరాలు సేకరించారు. జిత్తును త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దీంతోపాటు విజయవాడ కమిషనరేట్ పరిధిలోని క్రైమ్ విభాగం పోలీసులు కూడా ఈ కేసుపై విచారణ చేస్తున్నారు.
అసలేం జరిగిదంటే :శనివారం నాడుహైదరాబాద్‌కు చెందిన శ్యాంబాబా జ్యువెలరీ దుకాణం నుంచి బంగారు ఆభరణాలను విజయవాడలోని ఓ దుకాణానికి డెలివరీ ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో శ్యాంబాబా జ్యువెలరీ వ్యాపారి రూ.6 కోట్ల విలువైన సుమారు 7 కేజీల బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లో ఉంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన కారు డ్రైవర్ జితేంద్రకు, తన సొంత మనుషులైన బాలకృష్ణ, అంబాదాసులతో ఇచ్చి పంపించాడు. మధ్యాహ్నం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలోని ఫుడ్ ప్లాజా వద్ద వారు టీ తాగేందుకు ఆగారు.