Police Hand Over the YCP Leaders Stone Vehicle in Macharla:పల్నాడు జిల్లాలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసినా ప్రతిపక్షాలపై దాడులు, ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. మాచర్లలో రాళ్లతో ఉన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఇంటి సమీపంలో ట్రాలీ ఆటోలో రాళ్లు, ఖాళీ బీరు సీసాలు నిండిన వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇదే వాహనాన్ని కారంపూడి ఇంటికి పిన్నెల్లి తన కాన్వాయ్ వెంట తీసుకెళ్లి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడినట్లు తెలిసింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ప్రజల్లో ఇప్పటికి భయాందోళనలు తొలగలేదు.
మరోవైపు జిల్లాలోని మాచర్ల ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్ కారణంగా షాపులు తెరుచుకోలేదు. మాచర్ల పట్టణంలో పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే దాడులకు వెళుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం సమస్యాత్మక ప్రాంతాల్లో మాచర్ల, నరసరావుపేట, పెదకూరపాడులో 144 సెక్షన్ అమలుచేస్తూ నేతలను గృహనిర్బంధం చేశారు. స్వయంగా ఐజీ, ఎస్పీ మాచర్ల కేంద్రంగా ఉంటూ భద్రతను పర్యవేక్షించారు. ఇంటిదొంగలను గుర్తించి వారిపై నిఘా ఉంచడటంతో పోలీసుశాఖలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.