Gold Scam in Kanakadurga Private Gold Loan Company at Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండలోని కనకదుర్గ ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలో బంగారం మాయమైన ఘటనలో కేసు నమోదైంది. సంస్థ మేనేజర్ పల్లా ప్రశాంత్ కుమార్‌తో పాటు నలుగురు ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. తాకట్టు పెట్టిన బంగారం మాయమైందని కొందరు వినియోగదారులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గోల్డ్ లోన్ యాజమాన్యం సంస్థ అధికారులతో విచారణ చేపట్టింది. 56 లక్షల రూపాయల విలువైన 1,158 గ్రాముల బంగారం మాయమైనట్లు విచారణలో తేలిందని యాజమాన్యం తెలిపింది. ఘటనలో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బ్యాంక్ ఎదుట వంటవార్పు :పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎదుట గోల్డ్ బాధితులు నిరసన చేపట్టారు. రెండేళ్ల క్రితం గోల్డ్ అప్రైజర్ చేతివాటంతో నష్టపోయిన ఖాతాదారులు బ్యాంక్ వద్ద వంటవార్పు కార్యక్రమంతో ధర్నా నిర్వహించారు. నష్టపోయిన 500 మందికిగాను 320 మందికే అధికారులు డబ్బులు జమ చేశారని మిగిలిన 180 మందికి పైగా బాధితుల పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. బ్యాంకు అధికారులను లోపలికి వెళ్లకుండా బాధితులు గేటుకి తాళం వేశారు. తమ సొమ్ము తిరిగి ఇచ్చేంత వరకూ తాళాలు తీయమని స్పష్టం చేశారు.