Police Case on Former MLA Kodali Nani and Vasudeva Reddy : కృష్ణాజిల్లా గుడివాడలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గత కృష్ణా జిల్లా జేసీ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మాధవీలతారెడ్డిపై కేసు నమోదైంది. వాసుదేవరెడ్డి, కొడాలి నాని అనుచరులు తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Case Against AP Beverages EX MD Vasudeva Reddy : అదేవిధంగా వాసుదేవరెడ్డి, కొడాలి నాని, కలెక్టర్ మాధవీలతారెడ్డితో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ కీలక నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం బాధితుడు దుగ్గిరాల ప్రభాకర్ మాట్లాడుతూ 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని ఆయన తెలిపారు.
2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరెజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాధవిలతారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రయత్నించారని ప్రభాకర్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా కొడాలి నాని అనుచరులు తమపై బెదిరింపులకు దిగారని చెప్పారు. ఈ క్రమంలోనే తమ గోడౌన్లో ఉన్న లిక్కర్ కేసులను పగలకొట్టి తగలబెట్టారని వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.