తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగల ముఠాతో పోలీసుల దోస్తీ - నిందితులకు సహకరిస్తూ కమీషన్ల కోసం కక్కుర్తి - Three Cops and Robbery Gang Arrest

Three Cops Arrested in Mobile Robbery Case : కంచె చేను మేసిందన్న చందంగా రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరస్థులతో చేతులు కలిపారు. కాసులపై కక్కుర్తితో ఉద్యోగ ధర్మాన్ని మరిచి అడ్డదారి తొక్కారు. సెల్‌ఫోన్‌లు కొట్టేసే అంతరాష్ట్ర దొంగల ముఠాతో దోస్తీ చేస్తూ వారికి సహకరిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకొని ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న 9 మందిని అరెస్టు చేయగా అందులో ముగ్గురు పోలీసులే ఉండడం విస్తుగొలుపుతోంది.

Police and Mobile Robbery Gang arrested
Three Cops Arrested in Mobile Robbery Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 10:13 AM IST

Police and Mobile Robbery Gang arrested in Hyderabad : హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ మెట్రోస్టేషన్‌ వద్ద జులై 23న ఓ ప్రయాణికుడి నుంచి సెల్‌ఫోన్‌ కొట్టేస్తున్న వ్యక్తిని మెట్రో సెక్యూరిటీ అధికారి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పశ్చిమబెంగాల్‌కు చెందిన అల్‌ అమన్‌ గాజీగా గుర్తించారు. బిహార్‌, ఝార్ఘండ్ తదితర రాష్ట్రాలకు చెందినవారు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఖైరతాబాద్‌లోని ఓ ఇంట్లో సోదాలు చేసి మహ్మద్‌ షనవాజ్‌, గోవింద్ కుమార్‌ మెహతాతోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఝార్ఘండ్ పంపారు. ముఠా సభ్యులు పట్టుబడినప్పుడు విడిపించేందుకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును సైతం అరెస్టు చేశారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఝార్ఘండ్​కు చెందిన రాహుల్‌కుమార్‌, కాంచన్‌నోనియా వేర్వేరుగా అనుచరులను ఏర్పాటు చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఎనిమిదేళ్ల క్రితం వీరిద్దరికీ మైత్రీ కుదరగా మొదట్లో జేబు దొంగతనాలు చేసేవారు. రెండేళ్ల కింద చిన్నపాటి దొంగతనాలకు పాల్పడే వారితో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సూరత్, లక్నో, రాంచీ, బెంగళూర్, చెన్నై, వారణాసి, నాగపూర్ వంటి ప్రధాన నగరాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు.

10-12 ఏళ్ల పిల్లల్నే ముఠా సభ్యులుగా :ముఠా సభ్యులు రెండు భాగాలుగా విడిపోయి గుంపులుగా ఉన్న జనంలోకి చేరి సెల్‌ఫోన్లు కొట్టేసి క్షణాల్లో మాయమవుతారు. మరికొందరు ముఠా సభ్యులు అదే ప్రాంతంలో ప్రజల మధ్యలో కలిసిపోయి చోరీ చేస్తున్న వ్యక్తికి కాపలాగా వ్యవహరిస్తారు. పెద్దఎత్తున లాభాలు వస్తుండటంతో కొత్త ఎత్తులతో వేలాది ఫోన్లను కొట్టేసే స్థాయికి చేరారు. నేరగాళ్లు దొంగతనాలకు చిన్నారులను పావులుగా మలచుకున్నారు. పేద కుటుంబాల తల్లిదండ్రులకు కమీషన్‌ ఆశచూపి 10 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లల్ని ముఠా సభ్యులుగా చేర్చుకున్నారు. వీరికి జనసమూహంలోకి చేరి వస్తువులు, మొబైల్‌ ఫోన్లు చోరీ చేయడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

ఒకవేళ పట్టుబడితే చిన్నపిల్లలనే సానుభూతితో వదిలేస్తారనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడను అమలు చేస్తున్నారు. నిందితులంతా ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు వచ్చి ఖైరతాబాద్‌ ఎంఎస్​ మక్తాలో చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. 3 నెలలుగా నగరంలోని మెట్రోరైళ్లు, రైల్వేస్టేషన్ల టిక్కెట్‌ కౌంటర్లు, బోనాల వేడుకలు, ఊరేగింపుల్లోకి చేరి అదను చూసి వందల కొద్దీ ఫోన్లను తస్కరించారు. 50 నుంచి 60 చరవాణులు చేతికి చిక్కగానే ఝార్ఘండ్​కు సమాచారం అందిస్తారు. అక్కడ నుంచి రాహుల్‌కుమార్, ముక్తార్‌సింగ్‌ విమానాల్లో ఆయా నగరాలకు చేరతారు. ఫోన్లు సేకరించి తిరిగి రైలులో ఝార్ఘండ్ వెళతారు. అక్కడ నుంచి పశ్చిమబెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు ఫోన్లను దాటిస్తున్నారు.

నిందితుడికి ష్యూరిటీ ఇచ్చి సహకరించిన హోంగార్డు :రెండేళ్ల కింద ఎస్సార్​ నగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి క్రైం బృందంలోని సభ్యుడు, ప్రస్తుతం గాంధీనగర్‌ ఠాణాలో పనిచేస్తున్న హోంగార్డు అశోక్‌, అతడి వద్ద ఎలాంటి సొత్తు లేదని ష్యూరిటీ ఇచ్చి సహకరించాడు. అప్పటి నుంచి ఈ ముఠాలు ఎప్పుడు నగరంలోకి వచ్చినా సహకరిస్తూ భారీగా కమీషన్‌ తీసుకునేవాడు.

ఈ ఏడాది జూన్‌లో సైఫాబాద్‌లో పట్టుకున్న ఓ సెల్‌ఫోన్ దొంగను విడిపించేందుకు హోంగార్డుతోపాటు కానిస్టేబుల్‌ సాయిరాం సహకరించాడు. ప్రతిఫలంగా ముఠా సభ్యుడు షనవాజ్‌, హోంగార్డు అశోక్‌ భార్య బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ చేశాడు. ఈ మొత్తాన్ని కానిస్టేబుల్ సాయిరాం, సోమన్న, అశోక్‌ పంచుకున్నారు. నేరస్థులకు సహకరించినందుకు గానూ వీరిని సైతం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

'దొంగతనం కేసులో పట్టుబడిన వ్యక్తిని జులై 24న అరెస్టు చేసి జైలుకు పంపించాం. అతణ్ని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు ఈ ముఠాకు సహకరించారు. ఆ ముగ్గురు కూడా నేరాన్ని ఒప్పుకున్నారు'-విజయ్ కుమార్, పశ్చిమ మండల డీసీపీ

నిఘా నీడలో భాగ్యనగరం - చేతివాటం చూపించారో జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే! - mobile thieves in Hyderabad

గూగుల్ పే కొట్టు - దొంగను విడిచిపెట్టు - సెల్​ఫోన్ చోరుడికి సహకరించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details