Hunters Hunt Wild Animals in AP :అరుదైన జంతు, వృక్ష జాతులకు నల్లమల అడవులు నెలవు. జీవవైవిధ్యానికి పుట్టినిల్లు. సువిశాలమై ఈ ప్రాంతం వన్యప్రాణులకు ఎంతో భద్రమైనదిగా పేరు పొందింది. అటువంటి అడవిలో ఇప్పుడు అలజడి రేగుతోంది. ఇక్కడి జీవజాలంపై వేటగాళ్ల కళ్లు పడ్డాయి. ఉచ్చులు అమర్చుతూ వలలు ఏర్పాటు చేస్తూ యథేచ్ఛగా వేటను కొనసాగిస్తున్నారు. పెద్ద పులులు మొదలు అడవి కోళ్ల వరకు ప్రాణుల ఉసురు తీస్తున్నారు. నల్లమలలో జీవించే చిరుతలు, పులులు, నక్కలు, అడవి కుక్కలు, కృష్ణ జింకలు, దుప్పులు, కుందేళ్లు, అడవి కోళ్లు, మనుబోతులు, ఎలుగుబంట్లను మట్టుబెడుతున్నారు.
అంతరించి పోతున్న జాతుల్లో ఒకటైన అలుగు(పంగోలిన్)నూ వదలటం లేదు. ఈ సాధు జంతువు వేటగాళ్ల ఆగడాలతో ఇప్పుడు విలవిల్లాడుతోంది. మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో గత ఐదేళ్ల కాలంలో అలుగు అక్రమ రవాణాపై ఐదుకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది.
దొరికితే జైలు - జరిమానా : అడవి జంతువులను పెంచుకోవడం, వేటాడటం పూర్తిగా నిషేధం, అడవిలో, మన పరిసరాల్లోనూ వాటిని మచ్చిక చేసుకోవడంతో పాటు మాంసం కలిగి ఉండటం నేరమని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 చెబుతోంది. ఈ చట్టంలోనూ ఇటీవల కొన్ని మార్పులు చేశారు. నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఈ రెండింటినీ ఏకకాలంలోనూ అమలు చేయొచ్చుని అధికారులు పేర్కొంటున్నారు.
అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ అందరి కర్తవ్యం. ఒకవేళ గ్రామ పరిసరాల్లోకి అడవి జంతువులు వస్తే వాటికి హాని తలపెట్టకుండా అధికారులకు సమాచారాని తెలియజేయాలి. అడవులు, పొలాల్లో వేటకు విద్యుత్త్ తీగలు ఏర్పాటు చేయడం, వలలు, ఉచ్చులు అమర్చడం కూడా చట్టరీత్యా నేరం. ఈ విషయమై మార్కాపురం అటవీ క్షేత్రాధికారి వరప్రసాద్ మాట్లాడుతూ జంతువులను వేటాడాలనుకునే వారికి చట్టం ఓ హెచ్చరిక వంటిదని చెప్పారు. అంతరించిపోతున్న పంగోలియన్ వంటి జంతువులను సంరక్షించాలని ఆయన కోరారు.