People Complain to TDP Leaders in Mangalagiri Party Office:జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటే రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని గత ప్రభుత్వంలోని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారని తిరుపతి జిల్లాలోని రేణిగుంట మండలం కరకంబాడి బీసీ కాలనీకి చెందిన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గతంలో కడప- రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయామని వాపోయారు.
దీని గురించి అప్పటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్‌రెడ్డిని సంప్రదించగా రేణిగుంట వైఎస్సార్సీపీ నాయకుడిని మా దగ్గరకు పంపి న్యాయం జరగాలంటే ఒక్కొక్కరూ రూ.5 లక్షల చొప్పున లంచం ఇవ్వాలని అతడు డిమాండు చేశాడని బాధితులు తెలిపారు. దానికి వారు అంగీకరించకపోవడంతో పరిహారం రాకుండా అడ్డుకున్నారని బాధితులు వాపోయారు.
ఇలా ఎంతో మంది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులను టీడీపీ కార్యాలయంలో జరిగిన 'ప్రజావేదిక'లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు రహదారిని ఆక్రమించి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారని తిరుపతి నగరం ఐదో వార్డుకు చెందిన వి.రాధ టీడీపీ నేతల దృష్టికి తెచ్చారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.
దారి విషయంలో బెదిరించిన వైసీపీ నేతలు-పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు