People Spend More Money to Build A House :ఈ మధ్య కాలంలో ఇంటి నిర్మాణంలో పేద, మధ్య తరగతి, ధనిక అనే భేదాలు లేకుండా, ప్రతి ఒక్కరూ తమ అభిరుచులకు తగ్గట్లుగా ఎంత ఖర్చు అయినా హంగులకు మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇళ్లు కట్టే బిల్డర్‌కు ఎంత ఖర్చైనా తగ్గవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. తాము ఉండబోయే ఇంట్లో అన్ని హంగులూ ఉండేలా, చిరకాల వాంఛను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంటి నిర్మాణంలో రాయల్ పెయింట్స్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రూఫ్ల నిర్మాణం, వాల్స్‌కు రంగురంగుల బొమ్మలు, విద్యుత్ కాంతులు ఇలా వారికి నచ్చినట్లు ఇంటిని నిర్మించుకొని తమ కలను పూర్తి చేసుకుంటున్నారు.
ఈ రోజుల్లో ఇళ్లు కట్టడమనేది ఒక మహా యుద్ధమనే చెప్పవచ్చు. అందుకే పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అన్నారు. ఇల్లు కట్టాలంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టడమే కాదు, అందులో అన్ని హంగులూ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న పట్టణాల్లో సైతం హంగులతో కూడిన సొంతింటికే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఖర్చుకు ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. తమ అవసరాలు, అభిరుచుల మేరకు అధునాతన వసతులు, భవనాలను అద్భుతమైన రీతుల్లో నిర్మించుకుంటున్నారు.
ఓపెన్ కిచెన్‌కు ప్రాధాన్యం : రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా గృహాలంకరణ నిపుణులను పిలిపించుకొని మరీ పనులు అప్పగిస్తున్నారు. గదుల్లో అలంకరణ, పూజ గదులు, పడక గదులు ఇలా దేనికదే ప్రత్యేకం అన్నట్లు సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఓపెన్ కిచెన్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి ఆకర్షణీయ హంగుల కోసం ఖర్చుకు మాత్రం వెనుకడుగు వేయడం లేదు.