Madanapalle Fire Accident Case Updates : మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో వేళ్లు అన్నీ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే చూపుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత భూమార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 986 ఎకరాల అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా భూ మార్పిడి ప్రక్రియ చేపట్టారని విచారణలో వెల్లడైనట్లు వివరించారు. భూమార్పిడి కోసం పెద్దిరెడ్డి సతీమణి, బినామీలు చేసుకున్న అర్జీలు తప్పించడానికే ఈ అగ్నిప్రమాదం డ్రామా ఆడారన్నారు.
AP Govt on Madanapalle Fire Accident :అసైన్డ్ భూముల మార్పిడి విషయంపై రెవెన్యూ అధికారులను స్థానిక ఎమ్మెల్యే నిలదీయడంతో, తాము దొరికిపోతామని తెలిసే ఈ పనికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు వెనక పెద్దిరెడ్డి హస్తం ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది.
"గతంలో 986 ఎకరాల అసైన్డ్ భూములు దోచుకున్నారు. డీకేటీ, చుక్కల భూములను దోచుకున్నారు. పెద్దిరెడ్డి, ఆమె సతీమణి పేరు మీద భూమార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే నిలదీశారు. తాము దొరికిపోతామని తెలిసే ఈ పనికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదు." - అనగాని సత్యప్రసాద్, రెవెన్యూశాఖ మంత్రి
ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన దస్త్రాలే మాయం అవుతూ వస్తున్నట్లు సర్కార్ భావిస్తోంది. కొద్ది రోజుల క్రితం కాలుష్య నియంత్రణ మండలిలో దస్త్రాలు దహనం చేయడం, ఇప్పుడు ఈ ఫైల్స్ కాలిపోవడం చూస్తే అనుమానాలకు బలం చేకూరుతోందని చెబుతోంది. మదనపల్లె జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో పెద్దిరెడ్డి సతీమణి భూములు కూడా ఉన్నాయి. భూసేకరణ నోటిఫికేషన్‌లో స్వర్ణలత పేరు సూచిస్తూ పరిహారం చెల్లించినట్లు, వీటిని డీకేటీ భూములుగా పేర్కొన్నారు. మదనపల్లె పరిసరాల్లో పెద్దిరెడ్డి భార్య పేరిట భూములెలా వచ్చాయన్న అంశంపైనా విచారణ సాగుతోంది. డీకేటీ పట్టా తీసుకుని, తర్వాత కొనుగోలు పేరిట మార్పిడి జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.
ఐదు బృందాల నియామకం : కీలకమైన దస్త్రాలను దండుగులు కాల్చివేసినా, వాటి మూలాలు వెతికిపట్టుకునేందుకు ఐదు బృందాలను ప్రభుత్వం నియమించింది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి కొన్నాళ్లుగా దశల వారీగా ఈ ఫైల్స్ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరాయి. అయినప్పటికీ ఆయా ఫైళ్ల మూలాలు అక్కడ కూడా ఉండనున్నాయి. 11 మండలాల పరిధిలో 2022 ఏప్రిల్ 4 నుంచి పంపిన దస్త్రాల మూలపత్రాలను ఈ ఐదు బృందాలు వెతికి బయటకు తీయనున్నాయి.
సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం - ప్రమాదమా? కుట్ర పూరితమా! - Sub Collector Office Fire Accident
ప్రమాదమా? కుట్ర పూరితమా! - మదనపల్లె సంఘటనపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష - CM React Office Fire Accident