Pawan Kalyan Reaction Over Woman Murder: వైసీపీ దుర్మార్గపు పాలనలో పంచభూతాలకు కూడా పార్టీ రంగులు అద్దుతున్నారని జనసేసన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరం గ్రామానికి చెందిన బాణావత్ సామిని అనే గిరిజన మహిళ వాటర్ ట్యాంకర్ వద్ద తాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
ఈ దారుణ ఘటన రాష్ట్రంలో అనాగరిక పాలనకు నిదర్శనం అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వైసీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే నీళ్లు తాగడానికి, గాలి పీల్చుకోవడానికి వీలుంటుందని జీవో జారీ చేయడమే మిగిలిందని ధ్వజమెత్తారు. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీవాళ్లను అడ్డుకోవడమేంటని, నీటికి కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి దురదృష్టకరమని ఆక్షేపించారు.
ఈ దురాగతంపై అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల క్రితం పల్నాడులో ఎస్టీ మహిళను చంపేశారని పవన్ గుర్తు చేశారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసేవారిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వెనకేసుకొచ్చే వారికి నా ఎస్సీ, నా ఎస్టీ అనే అర్హత ఉందా అని జనసేనాని నిలదీశారు.
వ్యక్తిపై కర్రలతో దాడిచేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
ఇంతకీ ఏం జరిగిందంటే:తాగునీటి కోసం వచ్చిన గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో తాగునీటి సమస్య ఉండటంతో, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నీళ్లు పట్టుకోవటానికి బాణావత్ సామిని అనే మహిళ ట్యాంకర్ వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ వాళ్లకు నీళ్లిచ్చేది లేదంటూ వైసీపీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.