Passenger Facing Problems with APSRTC Buses: పగిలిన అద్దాలు, చిరిగిన సీట్లు, అరిగిన టైర్లు, కదిలితే చిరాకు పెట్టే శబ్దాలు. ఇదీ ఏపీఎస్ ఆర్టీసీలో బస్సుల పరిస్థితి. ఎంత దూరం పోతుందో? ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని దుస్థితి. ఆర్టీసీ బస్సులలో పరిస్థితి ఉండగా వీటిపై ఏ మాత్రం దృష్టి పెట్టని జగన్ సర్కార్ కోట్ల రూపాయలు వెచ్చించి మరీ కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలు చేసింది.
కాలం చెల్లిన డొక్కు బస్సులు ఎక్కువ అవుతున్నా కొత్త వాటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించట్లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డొక్కు బస్సుల్లో ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. బస్సులకు సరైన మరమ్మతులు చేయకపోవటం వల్ల అవి ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తున్నాయని, దీంతో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వస్తుందంటున్నారు.
గాడి తప్పిన ఆర్టీసీ - విలీనం చేసి చేతులు దులుపుకున్న జగన్ - అయిదేళ్లుగా నియామకాలు నిల్
కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో కడప జోన్ వ్యాప్తంగా 8 జిల్లాల ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులతో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు కడప జోన్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఆయన దృష్టికి జోన్ వ్యాప్తంగా గ్యారేజ్ కార్మికులు ఎదుర్కొంటున్న 52 రకాల సమస్యలను వినతిపత్ర రూపంలో తీసుకెళ్లారు. బస్సులకు మరమ్మతులు లేకపోవడం వల్ల అవి ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తూ సంస్థకు చెడ్డ పేరు తీసుకువస్తున్నాయని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలం చెల్లిన బస్సులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, వీటిని మరమ్మతులు చేసేందుకు సరైన విడిభాగాలు లేక గ్యారేజ్ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ కారణంగానే బస్సులు రన్నింగ్లో ఉండగానే స్టీరింగ్లు, చక్రాలు, యాక్సిల్స్ ఊడిపోవటం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.