Parents Suicide in Nandyal : కుమారుడు హిజ్రాతో సన్నిహితంగా ఉన్నారని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చేతికి అంది వచ్చిన కుమారుడు ఉన్నా పోస్టుమార్టం గదిలో అనాథ శవాల మాదిరిగా వారిని చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. నంద్యాలలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు పోలీసులు వెల్లడించారు.
ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఏ కష్టమూ తెలియకుండా పెంచారు. ఆస్తులు లేకున్నా పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమారుడిని బీటెక్ దాకా చదివించారు. చదువు అబ్బకపోవడంతో అతడి కోరిక మేరకు ఆటో కొనిచ్చారు. రోజూ ఆటో నడుపుకుంటున్న అతడి ఆలోచనలు, అభిరుచులను మాత్రం తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఆటో నడుపుతున్న క్రమంలోనే అతడికి హిజ్రాలతో ఏర్పడిన పరిచయం స్నేహానికి దారి తీసింది.
"కన్నా.. నువ్వులేని లోకంలో ఉండలేమురా.." తల్లిదండ్రుల దారుణ నిర్ణయం!
హిజ్రాలు తరచూ ఇంటికి కూడా రావడం ప్రారంభించారు. ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు ఇదేం పని అంటూ కుమారుడిని నిలదీశారు. అలాంటి అలవాట్లు మానుకోవాలని, పెళ్లి చేసుకుని తమకు ఆసరాగా ఉండాలని ప్రాథేయపడ్డారు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో కుమారుడికి తరచూ వాగ్వాదం జరిగేది. కొన్నాళ్లుగా కుమారుడికి కౌన్సిలింగ్ ఇప్పించినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా తనకు స్నేహితులే ముఖ్యం అని కుమారుడు తేల్చిచెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది.
ఎవరి కోసం జీవితాన్ని ధారపోశామో, ఎవరి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నామో అతడే చీదరించుకోవడంతో అనుక్షణం కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడికి ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేయాలని, మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలనుకున్న వారి కలల కల్లలయ్యాయి. ఇవే ఆలోచనలతో తీవ్ర మానసిక ఘర్షణకు లోనయ్యారు. తమ సమస్యను ఎవరికీ చెప్పుకోలేక, ఎలా పరిష్కారమవుతుంతో తెలియక మరణమే ప్రత్యామ్నాయం అని నిర్ణయించుకున్నారు.
నంద్యాల పట్టణానికి చెందిన దంపతులు సుబ్బరాయుడు, సరస్వతి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి కుమారుడు సునీల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సునీల్ హిజ్రాతో సన్నిహితంగా ఉండడంతో తల్లిదండ్రులు మందలించారు. హిజ్రాతో స్నేహం మాని పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అతను మాట వినకపోవడంతో తల్లిదండ్రులు కలత చెంది మూడు రోజుల కిందట గడ్డి మందు తాగారు. వారిని కర్నూలు ఆసుపత్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు -ఇస్మాయిల్, సీఐ
కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. అంతపని చేశారు!