OU JAC Students Protest in Front of Allu Arjuns House:విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి.
విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అదనపు పోలీసులు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్ధుల ఆందోళన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. సమాచారం తెలుసుకున్న ఆయన మామ చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆందోళన చేస్తోన్న ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు పీఎస్‌కు తరలించారు. అనంతరం అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఘటనపై అల్లు అల్లు అరవింద్: అల్లు అర్జున్ నివాసంపై విద్యార్ధి సంఘాల రాళ్ల దాడిపై ఆయన తండ్రి అల్లు అరవింద్ స్పందించారు." మా ఇంటి ముందు జరిగిన ఘటన అందరూ చూశారు. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు. అందరూ సంయమనం పాటించాలి. అదే మంచిది. తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు " అని తెలిపారు. అలాగే ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు పోలీసులు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లోని వ్యక్తుల నుంచి సమాచారం సేకరించారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద బయటి వ్యక్తులను నిల్చోకుండా పోలీసులు పంపిస్తున్నారు.