Ongole Dairy Pathetic Condition: ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, ఒంగోలు డెయిరీ కార్యకలాపాలు వైఎస్సార్సీపీ పాలనలో నిలిచిపోయాయి. జిల్లాలో అమూల్ ద్వారా పాలసేకరణ చేస్తామని చెప్పి, చివరకూ ఏదీ చేయలేక చేతులెత్తేశారు. కోట్లాది రూపాయలు విలువచేసే ఆస్తులను గాలికి వదిలేశారు. శీతలీకరణ కేంద్రాలు, పాలపొడి ఫ్యాక్టరీలను మూలకు చేర్చారు. అంతకుముందు దేదీప్యమానంగా వెలిగిన పాడి సహకార సంఘాలను మూసేసి సభ్యులను రోడ్డున పడేశారు. మిగతావారి కంటే అమూల్ ద్వారా ఎక్కువ ధర ఇప్పిస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పాడి రైతుకు మొండిచేయి చూపించారు.
ఒకప్పుడు రోజుకు లక్షలన్నర లీటర్ల పాలసేకరణ చేసిన ఈ డెయిరీని తొలుత సంక్షోభంలోకి నెట్టిన వైఎస్సార్సీపీ సర్కార్ నష్టాల్లో ఉందని చెప్పి అమూల్‌కు కట్టబెట్టింది. ప్రకాశం జిల్లా పాలకు ఇతర రాష్ట్రాల్లోనూ గిరాకీ ఉండేది. 10 నుంచి 12 శాతం వెన్న ఉండటం వల్ల... ఇతర జిల్లాల వారు కూడా ఈ పాలపై ఆసక్తి చూపేవారు. దీంతో ఒంగోలు డెయిరీ రైతుల పాలిట వరమయ్యింది. కోట్ల రూపాయల ఆదాయంతో... రైతులకు సకాలంలో చెల్లింపులు చేస్తూ మంచి ధర ఇస్తూ భరోసాగా ఉండేది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డెయిరీ ఇప్పుడు మూతపడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
అమూల్‌పై ఎనలేని ప్రేమ - కోట్ల విలువైన సహకార డెయిరీలు అప్పగింత
ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తులదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో డెయిరీ 1978లో ప్రారంభమైంది. రోజుకు 3.5లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో పాటు, 30మెట్రిక్ టన్నుల పాలపొడి తయారీ యూనిట్, 20మెట్రిక్ టన్నుల వెన్న తయారీ, 10 మెట్రిక్ టన్నుల నెయ్యి తయారీ సామర్థ్యంతో ఒంగోలు డెయిరీ ఉండేది. 278 పాల సహకార సంఘాల ద్వారా 35వేల మంది పాడి రైతులు నిత్యం పాలుపోసేవారు. డెయిరీకి కనిగిరి, కొండమంజులూరు, కంభం, దర్శి, వి.ఆర్.కోట, ఎర్రగొండపాలెంలో పాల శీతలీకరణ యూనిట్లు ఉన్నాయి.
కాలక్రమంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని, రైతులకు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి చేరిన సమయంలో 2018లో తెలుగుదేశం ప్రభుత్వం 35కోట్ల రూపాయలు విడుదల చేసి డెయిరీని కష్టాల నుంచి గట్టెక్కించింది. సంక్షోభంలో ఉన్న డెయిరీని ఆదుకుంటామని జగన్ అనేక ప్రగల్భాలు పలికి, అధికారంలోకి వచ్చాక అమూల్‌కు కట్టబెట్టి సర్వం నాశనం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ పాడి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని పునరుద్ధరించి, పాల సేకరణ కార్యక్రమాలను చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. డెయిరిని గాడిలోకి తీసుకువస్తే కరువు జిల్లాలో పాడికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్