Tirumala Laddu Issue in AP :తిరుమలలోని ఏ మాడ వీధిలో తిరిగినా గతంలో లడ్డూ ఘుమఘుమలు. ఆ సువాసన పీలిస్తే ఏదో తెలియని అనుభూతి. స్వామి ప్రసాదాన్ని స్వీకరించినంత ఆనందం పొందేవారు భక్తులు. అదంతా గతం. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో తిరుపతి లడ్డూను మిఠాయి కొట్లలోని ఒక సరకుగానే చూశారు. లడ్డూ నాణ్యతను పక్కనబెట్టి నాసిరకం నెయ్యి, జీడిపప్పు, యాలకులు ఇతరత్రా సామగ్రిని ఉపయోగించారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి లడ్డూ ఇచ్చినా స్వీకరిస్తారన్న అహంకారంతో గత ప్రభుత్వం వ్యవహరించింది. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసిరకం దినుసులు, కల్తీ నెయ్యి వాడారు. దీంతో రుచి, సువాసన పూర్తిగా మారిపోయింది. ఈ అంశంపై భక్తులతో పాటు పోటు సిబ్బంది అధికారుల దృష్టికి తీసువెళ్లారు.
నెయ్యి బాగోలేదన్నా చర్యలు తీసుకోలేదు : శ్రీవారి ఆలయంలో రోజుకు సుమారు 3.5 లక్షల లడ్డూలను సిబ్బంది తయారు చేస్తారు. ఇందుకు 14 టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. ఈ సందర్భంలోనే తిరుమలలో 82,100 కిలోల సామర్థ్యంతో మూడు నెయ్యి యూనిట్లును ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన మేరకు లడ్డూలు సరఫరా చేయాల్సిన నేపథ్యంలో 40 థర్మోఫ్లూయిడ్ స్టవ్‌లతో బూందీపోటును ఏర్పాటు చేశారు. గతంలో లడ్డూను తయారు చేసేందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం నెయ్యి వినియోగించడాన్ని తొలుత బూందీపోటులో పనిచేసే సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని అనేక సార్లు డిప్యూటీ, ఈవో సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకువెళ్లారు. అయిన ఎలాంటి ప్రయోజనం లేదు. సాధారణంగా బూందీ, నెయ్యి కలిపే సమయంలో సువాసన వస్తుంది. పుర వీధుల్లో తిరుగుతున్న భక్తులు ఈ సువాసనను ఆస్వాదించేవారు. నాసిరకం నెయ్యి వినియోగించినప్పటి నుంచి లడ్డూ తయారు చేసేటప్పుడే కనీసం సువాసన వచ్చేది కాదని కొంత మంది పోటు సిబ్బంది వెల్లడించారు.