NSSO Report in Telangana : తెలంగాణలో 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అదే సమయంలో 18 సంవత్సరాలు నిండిన వారిలో 42.4 శాతం మంది అప్పుల్లో ఉన్నారు. దేశ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇక ఇంట్లో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే ఆయా కుటుంబాలు కుదేలవుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో కుటుంబాలపై ఈ భారం ఎక్కువగా ఉంటోంది. ఈ వివరాలను జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో 8,758 గ్రామాలు, 6,540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై ఎడ్యుకేషన్, హెల్త్, మొబైల్, ఇంటర్నెట్, అప్పులు తదితర అంశాలపై సర్వే నిర్వహించింది. తెలంగాణలోని పరిస్థితులనూ విశ్లేషించింది.
ఆ సర్వే ప్రకారం తెలంగాణలో 15 నుంచి 24 సంవత్సరాల లోపు యువతలో 99.2 శాతం మంది పురుషులు, 98.3 శాతం మంది మహిళలకు చదవడం, తేలికైన వాక్యాలు రాయడంతోపాటు రోజువారీ లెక్కలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నారు. జాతీయస్థాయిలో చూస్తే 97.8 శాతం పురుషులు, 95.9 శాతం మహిళలకు ఈ సామర్థ్యముంది. ఇలాంటి వారు తెలంగాణలోని గ్రామాల్లో 98.1 శాతం, పట్టణాల్లో 99.6 శాతం మంది ఉన్నారు. ఇక 15 సంవత్సరాలు పైబడిన వారందరిలో తెలంగాణలో 75.4 శాతం మందికి ఈ సామర్థ్యాలు ఉన్నాయి. 18 సంవత్సరాలు పైబడిన 97.5 శాతం మందికి వ్యక్తిగత లేదా సంయుక్త బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. గ్రామాల్లో 98 శాతం, పట్టణాల్లో 96.9 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నాయి.
పాఠశాలల్లో 94 శాతం మంది చిన్నారులు :తెలంగాణలోని 6-10 సంవత్సరాల లోపు చిన్నారుల్లో 94 శాతం మంది బడికి వెళ్తున్నారు. గ్రామాల్లో 94.9 శాతం, పట్టణాల్లో 93.4 శాతం మంది ప్రాథమిక విద్యలో నమోదు చేసుకున్నారు. వీరిలో పట్టణాలతో పోల్చితే పల్లెలనే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని చిన్నారులందరిలో బాలురు 94.1 శాతం, బాలికలు 94.5 శాతం పాఠశాల విద్యలో ఉన్నారు. బాలురతో పోల్చితే బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది.
యువత టెకీ మంత్రం :21 నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువతలో 66.3 శాతం మంది సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను అభ్యసించారు. గ్రామాల్లో ఈ కోర్సులు చేసిన వారు 58.2 శాతం, పట్టణాల్లో 71.5 శాతం మంది ఉన్నారు. వీరిలో గ్రామాల్లో పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా ఉంటే పట్టణాల్లో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో 21 ఏళ్లు పైబడిన వారిని మొత్తంగా తీసుకున్నా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
చేబదులూ చెల్లించలేని దుస్థితి :ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రజల్లో ఎక్కువ మంది అత్యవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. వీరిలో చాలామంది చేబదులు తీసుకుంటున్నారు. తీసుకున్న ఆ నగదును సకాలంలో చెల్లించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు వారికి సమకూరడం లేదు. తెలంగాణలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతి లక్ష మందికి 42,407 మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండటం గమనార్హం. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామాల్లోనే అప్పులున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి లక్ష మందిలో గ్రామీణ ప్రాంతాల్లో 50,289 మంది, పట్టణాల్లో 31,309 మంది అప్పుల్లో ఉన్నారు. ఇదే వయసు వారిలో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే గ్రామాల్లో 18,714 మంది, పట్టణాల్లో 17,442 మంది అప్పుల్లో ఉండటం గమనార్హం.