No Electricity Charges Hike For 2024-25: నాలుగేళ్లు ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చిన జగన్ ప్రభుత్వం, ఎన్నికలు ముంచుకొస్తుండటంతో, ఇప్పుడు పేదలపై ప్రేమ కురిపిస్తోంది. విద్యుత్ ఛార్జీల భారం వేయకుండా ఉపశమనం కల్పించామంటూ ఉదారత చాటుకుంటోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఏదో ఒక పేరుతో వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపింది. ఏప్రిల్ వస్తోందంటే చాలు కొత్త విద్యుత్ టారిఫ్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి కల్పించింది.
2021 ఏప్రిల్ నుంచి విద్యుత్ వినియోగంతో సంబంధం లేకుండా కిలోవాట్‌కు 10 రూపాయల వంతున స్థిర ఛార్జీల భారం మోపడంతో మొదలు పెట్టింది. శ్లాబ్‌ల మార్పు, యూనిట్ ధర పెంపు ద్వారా 2022 ఏప్రిల్ నుంచి భారం మోపడంతో పాటు అదే ఏడాది ఆగస్టు నుంచి ట్రూఅప్, 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ ఎఫ్‌పీపీసీఏ 1, 2 లను ఒకే బిల్లులో వేసి వినియోగదారులకు షాక్‌లు ఇచ్చింది. ఐదేళ్లలో సుమారు 20 వేల కోట్ల రూపాయల మేర ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపి, వారు స్విచ్ వేయాలంటే భయపడే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నుంచి అమలయ్యే కొత్త టారిఫ్‌లో ఎలాంటి ఛార్జీల భారం లేకుండా చేశామని ప్రభుత్వం చెబుతోంది.
ఆలస్యమైన కాలానికి వడ్డీ: వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ చెల్లింపు ఆలస్యమైన కాలానికి వడ్డీ చెల్లించాలన్న రూల్‌ను కొత్తగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి అమలయ్యే విద్యుత్ టారిఫ్‌ను విజయవాడలో విడుదల చేశారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాల ఆధారంగా డిస్కంలకు రాయితీలు విడుదల చేయడంలో ఆలస్యమైన కాలానికి ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రైల్వేలకు మినహా ఏ ఒక్క కేటగిరీ వినియోగదారులపై ఛార్జీల పెంపు భారం లేకుండా టారిఫ్‌ను రూపొందించినట్లు వివరించారు.
ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం
56 వేల 573 కోట్లు అవసరం: 2024-25 ఆర్థిక సంవత్సరానికి 56 వేల 573 కోట్లు అవసరమని మూడు డిస్కంలు ప్రతిపాదించాయి. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత 56 వేల 501 కోట్ల 81 లక్షల రూపాయలకు ఏపీఈఆర్‌సీ అనుమతించింది. డిస్కంల ప్రతిపాదనలకు.. ఏపీఈఆర్‌సీ ఆమోదించిన మొత్తాలకు మధ్య 71 కోట్ల 22 లక్షల రూపాయల వ్యత్యాసం ఉంది. ఈ ప్రకారం వినియోగదారులకు ఇచ్చే టారిఫ్ రాయితీలు కాకుండా డిస్కంల ఆదాయ అంతరం 13,624 కోట్ల 67 లక్షలుగా ఉంది.
వినియోగదారులకు ఇచ్చే టారిఫ్ రాయితీలు 16 వందల 74 కోట్ల 51 లక్షలు కలిపితే డిస్కంల ఆదాయ తేడా 15 వేల 299 కోట్ల 18 లక్షలకు చేరుతుంది. ఇందులో ఎల్‌టీ కేటగిరి-1 గృహ విద్యుత్ వినియోగదారులకు 3 వేల 194 కోట్ల 57 లక్షలు, కేటగిరి-5 ఎల్‌టీ వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందించే ఉచిత విద్యుత్ కింద 9 వేల 242 కోట్ల 94 లక్షలు, ఆక్వా, పశుసంవర్థక రంగాలకు 13 వందల 20 కోట్ల 27 లక్షలు, ఇతర వర్గాలకు 12 కోట్ల 6 లక్షలు రాయితీగా అందుతుంది.