New Ration Cards In Telangana State:తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితిని కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వారంలోపే రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుండగా ఈలోగానే తాజా మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారు. పౌరసరఫరాలశాఖ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. పాత మార్గదర్శకాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలుగా ఉంటే పట్టణాల్లో రూ.2 లక్షలుగా ప్రస్తుతం ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తంది.
రాష్ట్రంలో 2.82 కోట్ల మంది లబ్ధిదారులు: రాష్ట్రంలో 9.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 2.82 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటికే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించుకునేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారులు 26 లక్షలుగా ఉన్నారు. ప్రభుత్వం జనవరిలో నిర్వహించిన ప్రజా పాలనలోమ భాగంగా కొత్త రేషన్‌కార్డుల డిమాండ్‌పై ఆలోచన చేశారు. సుమారు 10 లక్షల పైచిలుకు వచ్చిన దరఖాస్తుల్లో లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ఇచ్చినట్లయితే మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లకు చేరుతుంది రాష్ట్ర జనాభా 3.80 కోట్లు అని అధికారులు వెల్లడించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. సంక్రాంతి పండుగ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేలా సన్నాహాలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి.