NDA Women Leaders Fires on YSRCP: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని, వారి సంక్షేమాన్ని జగన్ తుంగలో తొక్కారని ఎన్డీఏ కూటమి పార్టీల మహిళా నేతలు మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మూడు పార్టీల నేతలు మాట్లాడారు. జగన్పై గులకరాయి వేసినందుకు వైసీపీ నేతలకు కడుపు మండితే, మహిళలతో పాటు అన్ని వర్గాల వారిని ఐదేళ్లుగా నరకం చూపిస్తున్న ప్రభుత్వంపై వారికి ఎంత మండాలని జనసేన అధికార ప్రతినిధి కీర్తన ప్రశ్నించారు.
రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయని, మహిళలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. బటన్ నొక్కుడు పేరుతో మోసం చేస్తున్న జగన్కు మహిళలు బటన్ నొక్కి వైసీపికి బుద్ధి చెప్పబోతున్నారని హెచ్ఛరించారు. బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన గురించి చెప్పాలంటే తెలుగులో అక్షరాలు సరిపోవన్నారు. మహిళల కష్టాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి వైసీపీ జేబులు నింపుకుంటోందని విమర్శించారు. మహిళలపై అరాచకాలపై మహిళా మంత్రులు మాట్లాడరా అని ప్రశ్నించారు.
టీడీపీ రాష్ట్ర నాయకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ నవరత్నాల్లో మొదటి రత్నం మద్యపాన నిషేదం ఏమైందని జగన్ను ప్రశ్నించారు. జగన్ పాలనలో మహిళా హోంమంత్రి రబ్బర్ స్టాంపుగా మారారని, మహిళా కమిషన్ సైతం కేవలం బాధితులకు పరిహారం చెక్కులు ఇవ్వటానికే ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్కు భయపడి ఆయన తల్లి అమెరికా పారిపోయారని, సొంత చెల్లెల్లు కొంగుచాచి న్యాయం అడుగుతున్నారని, మహిళా సంక్షేమంలో వైసీపీ విఫలమైంది అనేందుకు ఇవన్నీ నిదర్శనమని అభిప్రాయపడ్డారు.