Nara Rammurthy Naidu Last Rites: తిరుపతి జిల్లా నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో తల్లిదండ్రులు అమ్మణ్నమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల్లో రామ్మూర్తి నాయుడు సోదరుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. తండ్రి రామ్మూర్తినాయుడు చితికి నారా రోహిత్ నిప్పు పెట్టారు.
శనివారం హైదరాబాద్‍లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన రామ్మూర్తి నాయుడు పార్ధివదేహం ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. విమానశ్రయం నుంచి రోడ్డు మార్గాన పార్థివదేహన్ని నారావారిపల్లెకు తరలించారు. ప్రజల సందర్శనార్ధం నారావారిపల్లెలోని స్వగృహంలో పార్థివదేహన్ని ఉంచారు. తమ అభిమాన నాయుకుడు రామ్మూర్తి నాయుడు కడసారి చూపుకోసం చంద్రగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు పార్థదేహన్ని సందర్శించి నివాళులర్పించారు.
పలువురు ప్రముఖులు రామ్మూర్తినాయుడి పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు రోడ్డుమార్గాన నారావారిపల్లెకు చేరుకున్నారు. అనంతరం రామ్మూర్తి నాయుడి మృతదేహంపై చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్ పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. సోదరుడి కుమారులు రోహిత్, గిరీష్‌ను ఓదార్చారు.
రామ్మూర్తి నాయుడి మృతదేహనికి పలువురు ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు నివాళులర్పించారు. మహారాష్ట్ర గవర్నర్ సి. రాధాకృష్ణన్ నివాళులర్పించి చంద్రబాబుకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీనటులు మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మంచుమనోజ్, శ్రీవిష్ణు అంజలి ఘటించి రామ్మూర్తి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జిల్లాకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.