Nara Lokesh Election Campaign: ఆంధ్రప్రదేశ్లో వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్టుమెంట్ వాసులతో లోకేశ్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
పరిశ్రమలతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని సర్వనాశనం చేశారని లోకేశ్ విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. ఒక్క విద్యాసంస్థనైనా తీసుకొచ్చారా అని లోకేశ్ ప్రశ్నించారు. గంజాయికి ఏపీ అడ్డాగా మారిందని, ఇతర రాష్ట్రాలకి సైతం ఏపీ గంజాయిని తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇంటి, చెత్తపన్ను సామాన్య ప్రజలకు భారంగా మారాయని లోకేశ్ అన్నారు.
నాడు వద్దన్న వారే నేడు ఘన స్వాగతం పలికారు.. - Nara Lokesh election campaign
ముఖ్యమంత్రి జగన్ తన సొంత చెల్లెలలనే గౌరవించలేని వ్యక్తి అని, అలాంటి వారి పాలనలో మహిళలకు ఎలాంటి భద్రత లభిస్తోందో అర్థమవుతోందన్నారు. ఒక సమయంలో మంత్రి రోజా తనకు గాజులు, చీర పంపిస్తాన్నారని, కొడాలి నాని తన తల్లిని అవమానపరిచారని, జగన్ పాలనలో వారి మంత్రులు మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.