Musical Stones Exhibition In Guntur District : సంగీతానికి రాళ్లైనా కరుగుతాయనే సామెత మీరు వినేవుంటారు. కానీ రాళ్లే సరిగమలు పలికితే. అలా జరిగే ఛాన్సే లేదనుకుంటున్నారా? అయితే మీరు పొరబడుతున్నట్టే. సప్త స్వరాలే కాదు, ఈ రాళ్లు ద్వాదశ స్వర స్థానాలను సైతం పలికిస్తాయంటున్నారు సంగీత ఉపాధ్యాయుడు.
గుంటూరు జిల్లా చౌడవరం ‘చేతన’లోని సృజన సంగీత పాఠశాలలో స్వరాలు పలికే రాళ్లను ప్రదర్శనగా ఉంచారు. స్థానిక సంగీత పాఠశాల ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు వీటిని సేకరించారు. తన స్వగ్రామం బాపట్ల జిల్లా బల్లికురువ మండలం గొర్రెపాడు సమీపంలోని బొగ్గులకొండపైకి స్నేహితులతో కలిసి కోటేశ్వరరావు వెళ్లారు.
'రాజు' పాటకి అంతా ఫిదా- చూపు లేకున్నా చురుకు ఎక్కువే!
ఓ మిత్రుడు కాకతాళీయంగా విసిరిన రాయి వేరే రాయిని తాకి ‘స’ కారం ధ్వనించింది. వెంటనే ఆయన రాళ్లపై పరిశోధనలు చేసేవారిని పిలిపించి ఇక్కడి రాళ్లు కొన్నింటిని సేకరించి ఏ స్వర స్థానాలు పలుకుతున్నాయో తెలుసుకున్నారు. ద్వాదశ స్వర స్థానాలు పలికే రాళ్లను వారు గుర్తించారు. సాధారణంగా సప్తస్వరాలు పలికే రాళ్లు దొరకడమే కష్టమని, ఇక్కడ ద్వాదశ స్వర స్థానాలు పలికే రాళ్లు లభించడం అత్యంత అరుదని నిపుణులు తెలిపారని కోటేశ్వరరావు వివరించారు.
రాళ్లు సంగీతాన్ని పలుకుతుండటం చూసిన స్థానికులు అబ్బురపడుతున్నారు. ఈ క్రమంలో వాటిన చూసి ద్వాదశ స్వరాలు విన్నవారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రకృతి ప్రతీ కదలికలోనూ సంగీతం ఉందంటారు విద్వాంసులు. అది నిజమేననడానికి ఇటువంటి ఘటనలే నిదర్శనం అటున్నారు ఈ రాళ్ల స్వరాలు విన్నవారంతా.
నాట్య మయూరాలు ఈ అక్కాచెల్లెళ్లు - 10 ప్రపంచ రికార్డులు