Municipalities And Corporations Funds Diverted :గత ఐదేళ్లలో పంచాయతీలకే కాదు. పురపాలక, నగరపాలక సంస్థలకూ జగన్ ప్రభుత్వం రిక్తహస్తం చూపింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను సొంత పథకాలకు దారి మళ్లించింది. పట్టణ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పనులపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీవ్ర ప్రభావం చూపాయి. పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. బిల్లులు రాక అనేక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
నోరు విప్పని వైఎస్సార్సీపీ ఛైర్మన్లు, మేయర్లు : ఐదేళ్ల పాలనలో పట్టణ, నగర ప్రజలను వైఎస్సార్సీపీ పాలకులు నిండా ముంచేశారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను వాడేసుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బరితెగించింది. ఫలితంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఎన్నికలు నిర్వహించిన అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లోనూ వైఎస్సార్సీపీ నేతలే ఛైర్మన్లు, మేయర్లుగా ఉండటంతో నిధుల మళ్లింపుపై ఇన్నాళ్లూ ఎవరూ నోరు విప్పలేదు. ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై కూటమి ప్రభుత్వం ఆరా తీసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఘనకార్యం వెలుగుచూసింది.
నిలిచిపోయిన అభివృద్ధి పనులు : 2020-24 మధ్య మూడేళ్ల కాలంలో కేంద్రప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు 3వేల 644 కోట్ల రూపాయలను పట్టణ, స్థానిక సంస్థలకు విడుదల చేసింది. ఈ నిధులను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పుర, నగరపాలక, నగర పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుండా సొంత అవసరాలకు మళ్లించింది. ఫలితంగా నిధుల లేమితో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎన్నో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.