Bodybuilder From Warangal looking For Sponsors : బంగారానికైనా సానపెట్టనిదే వన్నెరాదు. క్రీడాకారులైనా అంతే. తగిన సాయం లభిస్తేనే విజేతలుగా నిలిచి దేశానికి పేరు తెస్తారు. కొందరైతే తలకు మించిన భారమైనా ఆటపై ఇష్టంతో సొంత ఖర్చులతో పోటీలకు వెళ్తుంటారు. అలాంటి వారిలో ఇతడూ ఒకరు. స్వశక్తితో బాడీ బిల్డింగ్‌లో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన తనకి తర్వాత ప్రోత్సాహం అందించేవారే కరవు అయ్యారు. అవకాశాలొస్తున్నా నిస్సహాయత వెంటాడుతోందని ఆవేదన చెందుతున్నాడు ఈ బాడీబిల్డింగ్ ఛాంపియన్.
హన్మకొండ జిల్లా కాజీపేట దర్గాకు చెందిన రామకృష్ణ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఏదోకటి చేయాలనుకున్నాడు. దేహదారుఢ్యంపై ఆసక్తి పెంచుకుని కండలు పెంచేందుకు కఠోరంగా శ్రమించాడు. ఫిట్నెస్ పోటీల్లో నిరూపించుకోవాలని, మెరుగైన శిక్షణ కోసం సొంతూరి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. తొలి పోటీలోనే పతకం దక్కడంతో మరింత కష్టపడ్డాడు. తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. పాల్గొన్న ప్రతి పోటీలో పతకాలు కొల్లగొడుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
'చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ అంటే నాకు ఇష్టం. ఫస్ట్‌టైం వరల్డ్ ఛాంపియన్షిప్ 2017లో చేశా. అప్పడు బెస్ట్ ఆఫ్ టెన్‌లో కూడా అవకాశం రాలేదు. దీంతో 2018లో ఇంటర్నేషనల్ కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. సౌత్ కొరియాలో పోటీలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించా'- రామకృష్ణ, అంతర్జాతీయ బాడీబిల్డర్
మిస్టర్ స్టీల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ :నెలకు 3, 4 పోటీల్లో పాల్గొంటూ కండల వీరుడిగా లెక్కకు మించి టైటిల్స్ కైవసం చేసుకున్నాడు రామకృష్ణ. అందుకు నిదర్శనంగా ఈయన ఇంట్లో ఎక్కడ చూసినా పోటీల్లో గెలుపొందిన కప్పులూ, మెమొంటోలే దర్శనమిస్తాయ్. 2022, 2023ల్లో వరసగా ఆల్ ఇండియా రైల్వేస్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌గా నిలిచి అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. 2021 ఉజ్బెకిస్థాన్‌లో మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌గా, 2019లో దక్షిణ కొరియాలో వెండి పతకం, మిస్టర్ సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఓవరాల్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అదే ఏడాదే మిస్టర్ స్టీల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ కూడా సాధించి అదరహో అనిపించాడు.