RRR CUSTODIAL TORTURE CASE: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామను కొట్టిన నిందితుడి గుర్తింపు పరేడ్ ప్రక్రియ పూర్తయింది. వైఎస్సార్సీపీ హయాంలో రఘురామను కస్టోడియల్ విచారణ సమయంలో దాడి చేసిన నిందితుల గుర్తింపు ప్రక్రియ నేడు జరిగింది. గుంటూరులో జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పెరేడ్‌లో రఘురామ పాల్గొన్నారు.
సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని రఘురామ తెలిపారు. గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించామన్నారు. దాడి సమయంలో సెల్ ఫోన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అతడి ముఖానికి ఉన్న ముసుగు తొలగడంతో దగ్గరగా చూశానని రఘురామ తేల్చిచెప్పారు. ఈ కేసులో A1, A2ను విచారణకు పిలవకపోవడంపై రఘురామకృష్ణ రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న సమయంలో రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో రఘురామను చిత్రహింసలకు గురిచేసి, అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది.
దీనికి సంబంధించి ఆదివారం నిందితుడి గుర్తింపు పరేడ్ ప్రక్రియను నిర్వహించారు. రఘురామపై దాడి చేసిన కేసులో నిందితుడిగా తులసిబాబు అనే వ్యక్తి ఉన్నాడు. పరేడ్ ప్రక్రియ పూర్తైన తరువాత రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం సమన్లతో కోర్టుకు వచ్చానని చెప్పారు. సీఐడీ కస్టడీలో తనపై దాడి చేసిన వారిని గుర్తించానని అన్నారు. తులసిబాబుకు కొందరు మద్దతివ్వడం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.
తులసిబాబుకి, టీడీపీకి సంబంధం లేదని గుడివాడ వాసులు చెప్పారని, అతడు ఎస్పీ వద్దకు నేరుగా వెళ్లగల వ్యక్తి అని పేర్కొన్నారు. అదే విధంగా పరారీలో ఉన్న ప్రభావతి కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. ప్రభావతి కూడా విజయ్‌పాల్‌లా పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చని, వారికి సుప్రీంకోర్టులోనూ బెయిల్ రాదని అన్నారు. అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్‌నూ ప్రశ్నించాలని రఘురామ కోరారు. కేసులో ఏ1, ఏ 2ను విచారణకు పిలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.