ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి సత్యకుమార్‌ అనుచరుడి రౌడీయిజం - రాడ్లు, కర్రలతో దాడి చేసి భూకబ్జాకు యత్నం - MINISTER FOLLOWER LAND ENCROACH

మంత్రి సత్యకుమార్‌ అనుచరుడి భూదందా - కియా పరిశ్రమ సమీపంలో కబ్జా యత్నం

Minister follower land encroach
Minister follower land encroach (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2025, 10:50 AM IST

Satya Kumar follower Tried to Encroach Land:శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియా పారిశ్రామికవాడ పరిధిలో విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్‌ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్‌ రౌడీయిజానికి తెగబడ్డారు. మండలంలోని అమ్మవారిపల్లి సమీపంలో జాతీయ రహదారికి అనుకొని ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై కన్నేశారు.

ఆదివారం ఎంపీపీ ఆదినారాయణ అనుచరులు వీరంగం సృష్టించారు. జేసీబీతో ప్రహరీని ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న యజమాని ప్రభాకర్​పై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటుగా ఓ కారు, ఓ జేసీబీని, వెంట తెచ్చుకున్న రాడ్లు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మునిమడుగు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 433లో 1.72 ఎకరాల భూమిని 2018లో గుంతకల్లుకు చెందిన ప్రభాకర్‌ కొనుగోలు చేశారు. ఈ భూమికి ఆనుకొని ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌ డైరెక్టర్‌గా ఉన్న గ్లోబల్‌ హార్టికల్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన భూములు సైతం ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంపీపీ ఆదినారాయణతో తనకు భూ తగాదాలు ఉన్నాయని తెలిపారు.

ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీపీగా ఎంపికైన ఆదినారాయణ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి మంత్రి సత్యకుమార్‌కు ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆదినారాయణ కారులో కొంతమంది ప్రభాకర్‌కు చెందిన భూమి వద్దకు వచ్చి బీభత్సం సృష్టించారు. ప్రభాకర్‌ను ఆదినారాయణతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. భూమిలో పని చేయొద్దని చెప్పినా వినవా, చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ ఆదినారాయణ ఫోన్‌లో బెదిరించారని బాధితుడు తెలిపారు. అంతే కాకుండా తనను చంపేయమని అనుచరులకు ఆదేశించినట్లు వాపోయారు.

దీంతో రెచ్చిపోయిన అనుచరులు ప్రభాకర్‌పై రాడ్లు, కర్రలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దగ్గర్లో ఉన్న పొలాల్లోని రైతులు గమనించి కేకలు వేయడంతో ప్రభాకర్‌ను విడిచి వారు పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఎంపీపీ ఆదినారాయణ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. బాధితుడు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ వివరించారు.

"నేను మా సొంత ల్యాండ్​లో కాంపౌండ్ వేసుకుంటుండగా ఆదినారాయణకి సంబంధించిన మనుషులు జేసీబీని తీసుకొచ్చి బెదిరించారు. మా అన్న చెప్పినా కూడా పని చేస్తున్నావ్ ఏంట్రా అని, జేసీబీతో ప్రహరీని కూల్చేశారు. తరువాత నన్ను కొట్టారు. ఆదినారాయణతో ఎప్పటికైనా నాకు ముప్పు ఉంది". - ప్రభాకర్‌, బాధితుడు

మరోసారి రెచ్చిపోయిన బీటెక్‌ రవి వర్గీయులు - ఎమ్మెల్సీ అనుచరుడిపై దాడి

నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం - వీఆర్వో, సర్వేయర్‌ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details