Minister Nara Lokesh Saved Virendra Kumar :సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో వ్యక్తిని ఏపీ మంత్రి లోకేశ్ కాపాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి వీరేంద్ర గల్ఫ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరేంద్ర కుమార్‌కు కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు. 16 నెలల క్రితం ఉపాధి కోసం ఏజెంట్ ద్వారా వీరేంద్ర దుబాయ్ వెళ్లారు. దుబాయ్‌లో మరో వ్యక్తికి వీరేంద్రను విక్రయించి హైదరాబాద్ ఏజెంట్ జారుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఎడారిలో చిక్కుకుని బాధితుడు నరకం చూశాడు. తనను రక్షించాలని ఏపీ మంత్రి లోకేశ్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వేడుకున్నారు. మంత్రి లోకేశ్ చొరవతో బాధితుడు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తానని అనుకోలేదని బాధితుడు వీరేంద్ర తెలిపారు.
వెంటనే స్పందించిన మంత్రి :నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి వాసి వీరేంద్ర కుమార్ ఈనెల 19న ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, ఎడారిలో ఒంటెల మధ్య తనను పడేశారని వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీరేంద్ర వీడియో పోస్ట్ చేయగా మంత్రి లోకేశ్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగాన్ని మంత్రి అప్రమత్తం చేశారు.
సహాయం చేసిన ఎన్నారై బృందం : శంషాబాద్ విమానాశ్రయంలో వీరేంద్రకు కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు స్వాగతం పలికారు. వీరేంద్రను చూసి ఆనందంతో గుండెలకు హత్తుకున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ ఏజెంట్‌కు లక్షా 70 వేల రూపాయలు చెల్లించానని బాధితుడు వీరేంద్ర తెలిపారు. తనను దుబాయ్‌లో మరో ఏజెంట్‌కు విక్రయించి జారుకున్నాడని తెలిపారు. తనను రక్షించిన మంత్రి లోకేశ్‌కు, తెలుగుదేశం ఎన్నారై విభాగానికి జీవితాంతం రుణపడి ఉంటానంటూ వీరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఇక తిరిగి ఏపీకి రాలేమోనని అనుకున్నానని, మంత్రి లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చానంటూ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్ తనకు అపాయింట్మెంట్ ఇచ్చి, జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు.
తెలంగాణ ప్రజల గల్ఫ్ కష్టాలకు తెర ఎప్పుడు - ఎందుకు ఇంకా వలసలు కొనసాగుతున్నాయి?