Dussehra Arrangements on Indrakiladri in Vijayawada : దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యత అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అధికారులతో ఆనం సమీక్షా నిర్వహించారు. అక్టోబరు 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని ఈ సందర్భంలో తెలియజేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అధికారులతో మంత్రి సమీక్ష :13 ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి అమ్మవారి దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. వీవీఐపీ దర్శనాలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు టైంస్లాట్ నిర్ణయించామని ఈ సందర్భంగా తెలియజేశారు. వీవీఐపీ దర్శనాలు జరిగే సమయంలో ఏ ఒక్క సామాన్య భక్తుల క్యూలైను ఆపబోమని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. 250 సీసీ కెమెరాలతో ఉత్స వాల నిర్వహణను అధికార యంత్రాంగం పరిశీలిస్తుందని తెలియజేశారు. ఉత్సవ రోజుల్లో అంతరాలయం దర్శనం ఉండబోదని వెల్లడించారు. బంగారు వాకిలి దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుదని పేర్కొన్నారు.