Midnight Biryani in Vizag : విశాఖపట్నంలో బిర్యానీ రుచులు నోరూరిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా నిర్వాహకులు వివిధ రకాల పేర్లతో వీటిని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. 4 AM బిర్యానీ, 12 AM బిర్యానీ అంటూ నయా ట్రెండ్ తీసుకొచ్చారు. వీటికి యువత ఆకర్షితులవుతున్నారు. ప్రత్యేకంగా ఆ సమయాల్లో తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా వెళ్లొద్దాం రా బ్రో అంటూ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లేందుకు తెగ ఇష్టపడుతున్నారు. ఇటువంటి బిర్యాని కేంద్రాలు సీతమ్మధార, బీచ్ రోడ్డు, ద్వారకానగర్, జీవీఎంసీ కార్యాలయం, జగదాంబ, ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.
ప్రత్యేకంగా యువత కోసం :బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా కొత్త ఫ్రాంచైజీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత కోసం అర్ధరాత్రి రుచులు పంచుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల బిర్యానీ (12 ఏఎం) పేరుతో విక్రయిస్తున్నారు. వీటి కోసం చాలా మంది వరుస కడుతున్నారు. అలాగే తెల్లవారుజామున నాలుగు గంటలకు, ఉదయం ఏడు గంటలకు సైతం బిర్యానీలు తినిపిస్తున్నారు. దమ్, ఫ్రై బిర్యానీలను ప్రత్యేకంగా వేడివేడిగా సిద్ధం చేస్తున్నారు.
సుగంధ ద్రవ్యాలతో :డబ్బా బిర్యానీ, బకెట్ బిర్యానీ వంటి పేర్లతో ఆహార ప్రియులను ఆకర్షించేలా బకెట్, స్టీల్ డబ్బాలో వేసి బిర్యానీ అమ్ముతున్నారు. బిర్యానీతో పాటు వాటిని కూడా ఇంటికి తీసుకుపోవచ్చు. మరోవైపు మిలటరీ బిర్యానీ, ఎంపీ గారి తాలుకా బిర్యానీ వంటి పేర్లతోనూ పలు చోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాజుల పలావ్ అంటున్నారు. సన్నని బియ్యంతో సుగంధ ద్రవ్యాలను బాగా దట్టించి ఘాటుగా ఉండేలా చేస్తున్నారు.