Medaram Jatara 2024 Last Day :నాలుగు రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర(Medaram Jatara) చివరి అంకానికి చేరుకుంది. నేడు అమ్మల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ సాయంత్రం పూజారులు గద్దెల వద్దకు వచ్చి, సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వన దేవతల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది.
ఈ క్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని విచ్చేస్తున్నారు. తల్లుల వనప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతున్నాయి. రెండేళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా, దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sammakka Saralamma Jatara :మహా జాతరకు భక్తులు పోటెత్తడంతో మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్(Medaram Heavy Traffic) ఏర్పడుతోంది. తాడ్వాయి, పస్రా గుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ మళ్లీ యథావిథిగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మేడారం భక్తులకు గుడ్‌న్యూస్ - అరచేతిలో 'జాతర' సమాచారం! - యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?