Visakha Double Death Case Updates :వారిద్దరిదీ ఒకే గ్రామం. ఇరువురి మధ్య పరిచయం అనైతిక బంధానికి దారితీసింది. కొన్నాళ్లు గుట్టుగా సాగిన వారి వ్యవహారం బయటకు పొక్కింది. ఇక అప్పటి నుంచి ఇరు కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో వారి అనైతిక బంధం అర్థాంతరంగా ముగిసిపోయింది. కానీ ఇద్దరి జీవితాలూ అంతమయ్యాయి. దీనివల్ల రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నెలకొంది.
ఆమెపరంగా తను తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. అతడిపరంగా చూస్తే వృద్ధాప్యంలో ఆసరా అవుతాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు దిక్కులేని వాళ్లయ్యారు. అతడి మరణంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరింత మందికి కనువిప్పు కలిగించే ఈ విషాదం లోతుల్లోకి వెళ్తే వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం, కృష్ణాపురం గ్రామంలో సోమవారం ఒకే రోజు నిమిషాల వ్యవధిలో కనకల లక్ష్మి (30) అనే వివాహిత, మొకర ఆదిత్య (22) అనే యువకుడు వేర్వేరు చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపై పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ కేసులో వారిద్దరి ఫోన్ రికార్డింగ్‌లు, ఛాటింగ్‌లు కీలకంగా మారాయి. అనైతిక బంధం కొమసాగిస్తున్న వారు కలిసి జీవించడం సాధ్యం కాదని, తనువు చాలించడమే మేలని తలచి క్షణికావేశంలో ఆదిత్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.