Hyderabad Wall Collapse News Updates :హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానతో నగరం అతలాకుతలం అయింది. భారీ వర్షం ధాటికి బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం చెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై రిటన్నింగ్ వాల్ కూలి పడటంతో ఈ సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, జేసీబీల సాయంతో మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగించారు. శిథిలాల నుంచి ఏడు మృతదేహాలను వెలికితీసినట్లు సహాయ సిబ్బంది తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో తిరుపతిరావు మజ్జి (20), శంకర్ (22), రాజు (25), ఖుషి, రామ్ యాదవ్ (34), గీతా( 32), హిమాన్షు (4) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి : రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడు మంది చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుండపోత వర్షం పడటంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పని చేసే కార్మికుల్లో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలైనట్లు తెలిపారు. చనిపోయిన వారు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు చెప్పారు.
భారీ వర్షానికి కొట్టుకొచ్చిన మృతదేహాలు : మరోవైపు సికింద్రాబాద్‌లోని బేగంపేట్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నాలాలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి మృతదేహాలు ఓల్డ్ కస్టమ్ బస్తీ నాలాలో కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బేగంపేట్ పోలీసులు, డీఆర్ఎఫ్ టీం, క్లూస్ టీం అక్కడికి చేరుకొని మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అకాల వర్షంతో రాష్ట్రంలో అల్లకల్లోలం - వందల ఎకరాల్లో దెబ్బతిన్న పసుపు, మొక్కజొన్న పంటలు - Unseasonal Rains in AP