Man Was Killed in Land Dispute in Telangana :డబ్బుపై ఆశతో మానవ సంబంధాలను మంటగలుపుతున్నారు అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. భూమి కోసం కుటుంబ విలువలు మరచి, విచక్షణా రహితంగా దాడి చేశారు. కొట్టొద్దని కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. తన భర్తపై దెబ్బపడొద్దని తాను అడ్డం పడినా వదిలిపెట్టలేదు. కేవలం భూమిలో సాగుకు పని మొదలు పెట్టినందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కర్రలతో దాడి చేసి ఏకంగా ప్రాణాలే తీశారు ఆ అన్నదమ్ములు. ఓ కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేశారు.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో భూ తగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. గ్రామానికి చెందిన గువ్వల సంజప్ప ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఉన్న పొలం సాగు చేసుకునేందుకు సొంతూరికి వెళ్లాడు. అయితే తమకున్న నాలుగున్నర ఎకరాల భూమికి సంబంధించి అన్నదమ్ముల మధ్య వివాదం కొనసాగుతోంది. రెండేళ్లుగా తమ దాయాదాలతో భూమి విషయమై గొడవ జరుగుతోంది.
సాగు మొదలెట్టినందుకు చంపేశారు :ఇదే అంశంపై సంజప్ప పోలీసులను ఆశ్రయించగా, సివిల్ కేసు కావడంతో కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే గురువారం పొలానికి వెళ్లిన సంజప్ప విత్తులు నాటేందుకు ప్రయత్నించాడు. గమనించిన దాయాదులు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. సంజప్పతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే నలుగురైదుగురు ఒకేసారి కర్రలతో విచక్షణ మరిచి సంజప్పపై దాడి చేశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని, ఆయనను కొట్టొద్దని స్థానికులు అడ్డుకున్నా వదలకుండా చితకబాదారు.