Leopard in Tirupati :వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో ఆవాసాలు లేక అడవి జంతువులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో ప్రజలు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పెద్దపులి, చిరుత, ఏనుగుల సంచారం ఎక్కువయ్యాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
తాజాగా తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపింది. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆవరణలోని వసతిగృహాల వద్ద సంచరించింది. గతంలో చిరుత సంచారంతో ఆ ప్రాంతంలో అధికారులు ఇనుప కంచె వేశారు. దీంతో అది లోపలికి ప్రవేశించలేక కంచె బయటే తిరుగుతోంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. వర్సిటీ యాజమాన్యం సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు చిరుత ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని అక్కడివారు భయాందోళనలకు గురవుతున్నారు.