Land Dispute in Nizamabad : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ వివాదంలో బబ్లూ అనే వ్యక్తిపై తన సమీప బంధువు లింగం అనే వ్యక్తి కేజివిల్ ట్రాక్టర్‌తో దాడి చేశాడు. వివాదం ఉన్న పొలంలో లింగం కేజివిల్ ట్రాక్టర్‌తో దున్నుతుండగా, బబ్లూ అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన లింగం ఒక్కసారిగా ట్రాక్టర్‌తో బబ్లూపైకి దూసుకెళ్లాడు. దీంతో బబ్లూకు తీవ్ర గాయాలు అయ్యాయి.
కుటుంబసభ్యులు వెంటనే బబ్లూను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు లింగం దాడి చేసినందుకు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.