Lack of Facilities in Maharaja Sarvajana Hospital : ఆసుస్పత్రి అంటే ప్రజలకు రోగాల నుంచి ఉపశమనం కల్పించాలి. కానీ విజయనగరం సర్వజన ఆసుపత్రికి వెళ్లేవారికి మాత్రం కొత్త కష్టాలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బోధనాసుపత్రిగా మార్చింది కానీ సేవలు మెరుగుపర్చ లేదు. రోగులు కూర్చోవడానికి కుర్చీలూ లేని పరిస్థితి. ఆసుపత్రి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం దృష్టి సాగించింది.
మహారాజా ఆసుపత్రికి అనారోగ్యం :జిల్లా ఆసుపత్రి అంటే మండల, పట్టణ స్థాయిల్లోని పీహెచ్సీ (PHC), సీహెచ్‌సీల్లో (CHC) అత్యవసర కేసులుగా పరిగణించే రోగులను అక్కున చేర్చుకుని ఉన్నత వైద్యం అందించాలి. కానీ విజయనగరం జిల్లా మహారాజా సర్వజన ఆసుపత్రిలో సౌకర్యాల కొరత రోగులను వేధిస్తోంది. ఏడాదిన్నర క్రితం వరకు జిల్లా కేంద్ర ఆసుపత్రిగా ఉండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక వైద్యశాల బోధనాసుపత్రిగా మార్చింది. వైద్య సేవలు మెరుగవుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 600 నుంచి 800 ఉండే ఓపీ రోగుల సంఖ్య వెయ్యి నుంచి 1200 వరకు పెరిగింది. అయితే రోగులకు తగ్గట్టు సౌకర్యాలు పెరగకపోగా మరింత దిగజారాయి.
వసతులు కల్పించని జగన్ ప్రభుత్వం :రోగులకు కూర్చునేందుకు సరైన సౌకర్యాలు లేవు. రోగులను తీసుకొచ్చేందుకు కావాల్సిన వీల్‌ఛైర్స్, స్ట్రెచర్లు అరకొరగానే ఉన్నాయి. ఎంఆర్ఐ (MRI) స్కానర్ ఏడాదిగా పనిచేయక రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు తీయాల్సి వస్తుంది. మధ్యాహ్నం తర్వాత వైద్య నిపుణులు అందుబాటులో ఉండటం లేదని రోగుల బంధువులు చెబుతున్నారు. నీటి కొరతా వేధిస్తోంది. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక రోగాలు రెట్టింపు అవుతున్నాయని రోగులు వాపోతున్నారు.
"చాలా మంది రోగులు వస్తున్నారు. ఎక్కడా ఏ డాక్టర్ ఉంటారో సరియైన గైడెన్స్ ఇవ్వడం లేదు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతగా ఉన్నారు. ఎవరూ వస్తున్నారో ఎవరు వెళున్నారో తెలియదు. ఇక్కడ మంచినీటి సదుపాయం సరిగా లేదు. వీల్‌ఛైర్స్ కొరతగా ఉన్నాయి. వచ్చిన వారికి కూర్చొవడానికి కుర్చీలు, ఫ్యాన్లు లేవు. ఆసుపత్రి భవనం ఇరుక్కుగా ఉండటం వల్ల వచ్చిపోయే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది" _ రోగులు