Kurnool SP Bindu Madhav Exclusive Interview :సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా, కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగేలా, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడితే పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదన్న విషయాన్ని సోషల్ సైకోలు గుర్తుంచుకోవాలని కర్నూలు ఎస్పీ జి.బిందుమాధవ్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే సిబ్బందిపైనా చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. తమకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని తెలియజేశారు. వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 19 కేసులు నమోదయ్యాయని జి. బిందుమాధవ్ వెల్లడించారు. ఆ కేసుల్లో ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని తెలియజేశారు. మరి కొన్ని ఫిర్యాదులూ ఇటీవలే నమోదు అయ్యాయని, వాటినీ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ సైకోలు ఏ జిల్లాకు చెందిన వారైనా తమకు ఫిర్యాదు అందితే మాత్రం కేసు తప్పదని హెచ్చరించారు. బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను విచారించి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపారని తెలియజేశారు. మహానందికి చెందిన జగన్‌కృష్ణ అనే వ్యక్తి సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను తిడుతూ పోస్టులు పెడితే అతడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారని పేర్కొన్నారు.
సజ్జల భార్గవ్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు - లుక్ అవుట్ నోటీసులు జారీ
ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి :కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లోని పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టామని జి. బిందుమాధవ్ పేర్కొన్నారు. ‘పల్లెనిద్ర’ కార్యక్రమం పేరుతో పోలీసులను ఆయా గ్రామాలకు పంపి ఒకరోజు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు. గ్రూపుల మధ్య విభేదాల కారణంగా శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండేలా వారికి అవగాహన కల్పిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్ కారణంగా కొన్ని కుటుంబాలు ఎలా నష్టపోయాయో ప్రజలు వివరిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 194 గ్రామాల్లో ‘పల్లెనిద్ర’ పూర్తైందని తెలిపారు.
24 మందిని జైలుకు పంపాం :ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడి దౌర్జన్యాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులందాయని జి. బిందుమాధవ్ తెలిపారు. వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి ఎమ్మెల్యే సోదరుడితో పాటు మొత్తం 24 మందిని ఆ ఒక్క కేసులోనే జైలుకు పంపారని పేర్కొన్నారు. నేరాలు, దౌర్జన్యాలకు సంబంధించిన సాక్ష్యాలు క్షణాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితువు పలికారు.