సంగీతంతో పాటు పలురంగాల్లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లు- పదేళ్ల వయస్సు లోపే ఎన్నో అవార్డులు (ETV Bharat) Sisters Excelling in Music and Various Fields:వాళ్లు స్వరం విప్పారంటే రాగాలు వీనుల విందు వీస్తాయి. వారి గాత్రం శ్రవణానందాన్ని కలిగిస్తుంది. కేవలం పాటలు పాడంటం మాత్రమే కాదండోయ్ పలు రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలీలు ఈ అక్కాచెల్లెళ్లు. శాస్త్రీయ సంగీతం, సినీ సంగీతం, జానపద గీతాలు, అన్నమయ్య, త్యాగరాయ కీర్తనలనూ అలవోకగా ఆలపిస్తారు. అంతేకాదు ఆటల్లోను, చిత్రలేఖనంలోనూ వారెవ్వా అనిపిస్తారు. ఇన్ని కళల్లో రాణిస్తూనే చదువుల్లోనూ ప్రతిభ కనబరిచి అందరి మన్ననలు పొందుతున్నారు.
వేదికలపై సుమధుర స్వరాలు పలికిస్తూ సంగీత ప్రియుల మదిని దోసున్న ఈ యువతుల పేర్లు ఋగ్వేదం పద్మశ్రీ, ఋగ్వేదం కృష్ణశ్రీ. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామం వీరి స్వస్థలం. తండ్రి హరివెంకటకిషోర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా తల్లి కల్యాణి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేశారు. తెలుగు భాష, సంస్కృతి సాంప్రదాయాలు, కళలు పట్ల అపార ఆపేక్ష కలిగిన ఈ దంపతుల ఆలోచనలకు అనుగుణంగానే వీరికి సంగీత సరస్వతులు పుట్టారు.
వారసత్వ సంపదను ఒడిసిపట్టుకున్న యువకుడు - జాతీయస్థాయి సంగీత పోటీల్లో పతకాల పంట - Yasaswi Shows Talent in Fine Arts
పాఠశాలలో అడుగు పెట్టకముందే సుమతీ, వేమన, కృష్ణశతకాలు కంఠస్తం చేశారు ఈ యువతులు. శతకాలతో పాటు గీతా పారాయణం, ఆదిత్య హృదయం, సహా శ్రీకృష్ణ అవతారం అనర్గళంగా చెప్పేవారు. చిన్నతనంలోనే వీరి ప్రతిభకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముగ్దులయ్యారు. అప్పట్లోనే పలువురు సంగీత దర్శకులు, గాయనీ గాయకులూ, ప్రముఖులతో ప్రశంసలు పొందారు.
పట్టుమని పదేళ్ల వయస్సు రాక ముందే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు ఈ సోదరీమణులు. తొలుత జిల్లా స్థాయిలో తరువాత రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని తెలుగు వారి గళమయ్యారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కలసి ఇప్పటి వరకు 500 పైగా ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఈ తెలుగు సింగర్లు అంతర్జాతీయ వేదికలపైనా సత్తా చాటుతూ ఔరా అనిపిస్తున్నారు.
తెలుగుతో పాటు అంతర్జాతీయ వేదికలపైనా ఈ సంగీత సరస్వతుల స్వరాలకు పలు అవార్డులు సొంతమయ్యాయి. 2018లో సింగపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పాటల పోటీల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు కైవసం చేసుకొని తెలుగు కళలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు. 2019లో రాష్ట్ర స్థాయి గీతాల పోటీల్లో ద్వితీయ బహుమతి, శాస్త్రీయ సంగీతంలో ప్రథమ స్థానంలో నిలిచారు. మ్యూజిక్ అండ్ ఆర్ట్ విభాగంలో ఋగ్వేదం పద్మశ్రీ ప్రతిభకు మెచ్చిన అమెరికన్ మెరిట్ కౌన్సిల్ గతేడాది సెప్టెంబర్ 27న సర్టిఫికెట్ ఇచ్చి సత్కరించింది.
జాతీయ, పాశ్చాత్య భాషల్లో పాటలు పాడి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ యువతులు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న విజయవాడలో 116మంది ప్రసిద్ధ తెలుగు గాయనీమణులు పాడిన పాటలను 4 గంటల 40 నిముషాలపాటు ఏకధాటిగా ఆలపించింది పద్మశ్రీ. ఇందుకుగాను హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. దీంతో 20 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన తెలుగమ్మాయిగా మరో రికార్డు సృష్టించింది. ఈ ఘనతను సాధించిన తొలి తెలుగు సింగర్‌గా ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సైతం నెలకొల్పింది.
కూచిపూడి, భరత నాట్యంలోనూ ప్రావీణ్యం సంపాదించిన ఈ ఇద్దరు యువతులు చిత్ర లేఖనంలోనూ నిష్ణాతులే. ఆకట్టుకునేలా విభిన్న శైలిలో చిత్రాలు గీయడం వీరి ప్రత్యేకత. ప్రకృతిని ప్రేమించాలని, వన్యప్రాణులను రక్షించాలనే సందేశంతో గీసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. సంగీతం, చిత్రలేఖనంలోనే కాదు ప్రతిభా పోటీలు, క్రీడల్లోనూ రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఫుట్ బాల్ క్రీడాకారిణులుగా అండర్ 14 జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా సైకిల్ పోలో, ఫెన్సింగ్, హాకీలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ తమ ప్రతిభ కనబరిచారు.
'సంపూర్ణ భారతయాత్ర' - దేశం నలుమూలల కూచిపూడి ప్రదర్శన
మహిళల ఆత్మ రక్షణలో కీలకపాత్ర పోషించే కత్తి సామును సైతం నేర్చుకున్నారు ఈ యువతులు. ఓ పక్క ఉన్నత విద్యను అభ్యసిస్తూనే సంస్కృతి సాంప్రదాయాలను పదిమందికి పంచడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి తాము నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం సహా కళలపై మెళకువలను ఆన్లైన్లోనే పదిమందికి ఉచితంగా అందించి శభాష్ అనిపించుకుంటున్నారు.
ఈ అక్కాచెల్లెళ్లు పలు రంగాల్లో రాణిస్తూనే చదువులోనూ ప్రతిభ చాటుతున్నారు. ప్రైవేటు కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన పద్మశ్రీ ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఐదంకెల వేతనంతో ఉద్యోగాన్నీ సంపాదించారు. చిన్నమ్మాయి కృష్ణశ్రీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో సత్తా చాటి బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులో చేరబోతోంది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమని చెప్తోంది కృష్ణశ్రీ.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, కళలను రక్షించి భావితరాలకు అందించాలనే పట్టుదలతో ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలకు సంగీతాన్ని నేర్పించినట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు. పిల్లల అభిరుచిని గుర్తించి ప్రోత్సహిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేందుకు తమ కూతుర్లకు వచ్చిన అవార్డులే నిదర్శనమంటున్నారు. చదువులు పూర్తైన తరువాత విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలని చూస్తున్న నేటి తరంలో భారతీయ సంగీత, సాహిత్యాలు, కళలకు ప్రాణం పోస్తోన్న ఈ యువతుల కృషి అభినందనీయం.