Kolleru Lanka Villages Stuck in Flood Effect : కొల్లేరు లంక గ్రామాలు ముంపు గుప్పెట్లో చిక్కుకుంటున్నాయి. బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ అతలాకుతలం కాగా ఆ వరద నీరంతా కొల్లేరులో కలవడంతో లంక గ్రామాలకు వరద పోటు తాకింది. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఓ వైపు ఆక్రమణలు, నిర్వహణ లోపాలతో ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ వరద ప్రభావం ఏలూరు జిల్లాలోని ఏలూరు, మండవల్లి, కైకలూరు మండల్లాలోని గ్రామాలపై పడనుంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, మున్నేరుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో కొల్లేరు నిండుకుండలా కనిపిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు కొల్లేరులో కలిసే 68 మేజర్, మైనర్ డ్రెయిన్లు సైతం భారీగా వరద నీటిని తీసుకొస్తున్నాయి. దీంతో కొల్లేరు మరింత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కొల్లేరులో మామూలు రోజుల్లో 10వేల క్యూసెక్కులు మాత్రమే ఉండే నీరు ప్రస్తుతం 25 వేల క్యుసెక్కులకు చేరింది.
ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా నీరు :కొల్లేరు ఉగ్రరూపం దాల్చడంతో బుధవారం ఉదయం నుంచే మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మణుగులూరు, కొవ్వాడలంక గ్రామాల్లోనూ నీరు చేరింది. చినఎడ్లగాడి దగ్గర ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారిపై రెండు చోట్ల రెండడుగుల ఎత్తులో ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది.
శాంతించిన కృష్ణమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - KRISHNA River Flood Flow Decrease