Key Meeting on AP Bifurcation Issues :ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై దిల్లీలోని కేంద్రహోంశాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్ లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధానాంశాలపై అధికారులు చర్చించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
ఇటీవల కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఎఎస్ అధికారి గోవింద్ మోహన్ తొలిసారి ఏపీ విభజన చట్టంపై సమీక్ష చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విభజన చట్టం అమలుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి లోతుగా సమీక్షించారు. విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాలపై ఎక్కువ చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఉన్నాయన్నట్లు వెల్లడించారు. వాతావరణం సానుకూలంగా ఉన్నప్పుడే సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయని అధికార వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
3 అంశాలపై అంగీకారం - ఆ ఆస్తులు, అప్పులపై తేలని పంచాయితీ
విదేశీ సంస్థల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పుల వ్యవహారంలో న్యాయ సలహా ప్రకారం వెళ్లాలని హోం శాఖ కార్యదర్శి సూచించారు. దీనికి ఇరు రాష్ట్రాలు తమ అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయం తీసుకుంటామని చెప్పగా, త్వరగా తీసుకోవాలని హోం కార్యదర్శి చెప్పినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల ఏజీలు చెప్పే అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని వెల్లడించిన హోం శాఖ కార్యదర్శి. విభజన, ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు హోం కార్యదర్శి కీలక సూచనలు చేసినట్లు సమాచారం.