CBI Recommends Issuance of Red Corner Notice in Phone Tapping Case : సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మీడియా ఛానెల్ నిర్వాహకుడు అరువెల శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీబీఐ అనుమతిచ్చింది.
రెడ్ కార్నర్ నోటీసు కోసం హైదరాబాద్ పోలీసులు పంపిన రిపోర్ట్‌ను సమ్మతించిన సీబీఐ, ఇంటర్‌పోల్‌కు లేఖ రాసింది. నిందితులిద్దరిపై రెడాకార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ సిఫారసు చేసింది. సీబీఐ లేఖను ఇంటర్ పోల్ పరిగణనలోకి తీసుకుని నోటీసు జారీ చేస్తే నిందితులిద్దరినీ భారత్‌కు అప్పగించే అవకాశముంది. నిందితులు అమెరికా సహా 196 దేశాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడి పోలీసులు సైతం పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం సీబీఐకి సమాచారమిచ్చి, నిందితులను స్వదేశానికి బలవంతంగా చేస్తారు.
ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు : ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసుతో నిందితులు విభేదిస్తే, వారు ఏ దేశంలో ఉంటే అక్కడి కోర్టును ఆశ్రయించొచ్చు. అక్కడ ఊరట లభించకుంటే డిపోర్టేషన్ తప్పదు. కాగా, గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం సాగిందని ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు.