Kavach Installation in AP :ఏపీలోని 3 కీలక రైలు మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలెట్ రైలును ముందుకు నడిపితే, ఈ వ్యవస్థ అప్రమత్తం చేసి, బ్రేక్‌లను తన నియంత్రణలోకి తెచ్చుకొని ప్రమాదాలను నియంత్రిస్తుంది. ఇలాంటి కీలకమైన కవచ్ వ్యవస్థ దువ్వాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు, మంత్రాలయంరోడ్-రేణిగుంట మార్గాల్లో అందుబాటులోకి రానుంది. అలాగే ఓ రైలు ఒక స్టేషన్ నుంచి బయలుదేరాక మరో స్టేషన్‌కు చేరే వరకు ఆ మార్గంలో ఇంకో రైలును పంపేందుకు అవకాశం ఉండదు. దీని వల్ల రైళ్ల నిరీక్షణ పెరిగిపోతోంది. దీనికి అడ్డుకట్టవేస్తూ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విధానాన్ని సైతం ఈ 3 మార్గాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కవచ్, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌లకు కలిపి రైల్వే శాఖ 2,104 కోట్ల రూపాయలు కేటాయించింది.
ఎలక్ట్రానిక్, రేడియో ఫ్రీక్వెన్సీని గుర్తించే పరికరాలు :కవచ్ ద్వారా రైళ్లు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలు ఉంటుంది. ఈ వ్యవస్థలో ఎలక్ట్రానిక్, రేడియో ఫ్రీక్వెన్సీని గుర్తించే పరికరాలు ఉంటాయి. రైలు ఇంజిన్లలో, సిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాలు, ప్రతి రైల్వే స్టేషన్‌లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇదంతా జీపీఎస్‌తో అనుసంధానమై పని చేస్తుంది. లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ వద్ద ఆగకుండా ముందుకు వెళితే, కవచ్ వ్యవస్థ అప్రమత్తం అవుతుంది. బ్రేక్‌లను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. అదే లైన్‌లో రైలు వస్తున్నట్లు తెలిస్తే వెంటనే రైలుని ఆపేస్తుంది.
"అన్ని రైళ్లలో 'కవచ్ వ్యవస్థ' ఏర్పాటు చేస్తాం" - అశ్వినీ వైష్ణవ్
దీనిని దువ్వాడ-విజయవాడ మధ్య 332 కి.మీ. మేర ఏర్పాటు చేస్తున్నారు. బల్హార్షా-విజయవాడ-గూడూరు మార్గంలో 742 కి.మీ. మేర దీనిని అమర్చే పనులు మొదలు అయ్యాయి. ఇందులో రాష్ట్ర పరిధిలోని 325 కి.మీ. ఉంది. వాడి-గుంతకల్లు-రేణిగుంట మార్గంలో 538 కి.మీ.లో కవచ్ మంజూరుకాగా, ఇందులో మన రాష్ట్ర పరిధిలోని 402 కి.మీ. ఉంది.