Kathipudi to Ongole NH Expansion : ఏపీలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణ భాగ్యం దక్కింది. దీనిని నాలుగు, ఆరు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సలహా సంస్థ ఎంపికకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. దీంతో 390 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును త్వరలో విస్తరించనున్నారు.
భీమవరం బైపాస్‌కు కొత్త ఎలైన్‌మెంట్ :దాదాపు మూడు సంవత్సరాలుగా కోర్టు కేసు కారణంగా నిలిచిపోయిన ఆకివీడు-దిగమర్రు ఎన్‌హెచ్ విస్తరణ, అందులోని భీమవరం బైపాస్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. భీమవరం వద్ద కొత్త ఎలైన్‌మెంట్‌తో బైపాస్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య కొలిక్కివచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలోనే పామర్రు-ఆకివీడు-దిగమర్రు నేషనల్ హైవే-165 విస్తరణ మంజూరైంది. ఇందులో పామర్రు-ఆకివీడు మధ్య 64 కిలోమీటర్ల రెండు వరుసలుగా విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఆకివీడు-దిగమర్రు భాగంలో భీమవరం బైపాస్ వివాదం తలెత్తింది.
భీమవరానికి ఎడమవైపు వెళ్లేలా 18 కిలోమీటర్ల మేర బైపాస్‌తో ఎలైన్‌మెంట్‌ను మొదట ఖరారు చేశారు. అయితే కొందరు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ బైపాస్ భాగమే కాకుండా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఆకివీడు-దిగమర్రు మొత్తం రోడ్డు విస్తరణపై స్టే వచ్చింది. ఎన్‌హెచ్ వార్షిక ప్రణాళికలో దీనికి ఏటా రూ.1000 కోట్లు మంజూరవుతున్నా ఎలైన్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఇప్పటివరకు పురోగతి లేకుండా పోయింది.
తాజాగా భీమవరం వద్ద బైపాస్‌ను కుడివైపు (గొల్లవానితిప్ప వైపు) నిర్మించేలా ఎలైన్‌మెంట్ ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో ఆకివీడు నుంచి ఉండి, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు మీదుగా దిగమర్రు వరకు 43 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. ఇందులో ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40 కిలోమీటర్లు నాలుగు వరుసలుగాను, మిగిలిన 3 కిలోమీటర్లు రెండు వరుసలుగా విస్తరిస్తారు. ఫిబ్రవరి నాటికి డీపీఆర్ సిద్ధమైతే మోర్త్ ఆమోదం తెలిపి, విస్తరణ టెండర్లు ఆహ్వానించేందుకు అవకాశం ఏర్పడుతుంది.