Kaleshwaram Project Judicial Inquiry Updates :కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక ఆనకట్టల నిర్మాణాలతో సంబంధాలున్న గత సర్కార్‌లోని బాధ్యులకు, ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు. కమిషన్ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి అవసరమైతే వారిని విచారణకు పిలవనున్నట్లు తెలిసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రస్తుతం సాంకేతికాంశాలపై చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చింది.
Kaleshwaram Barrages Issue Updates :కొద్దిరోజుల్లో ఆర్థికాంశాలపై కమిషన్ విచారణ ప్రారంభించనుంది. మరోవైపు డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, నిర్వహణకు సంబంధించి ఇంజినీరింగ్ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని కమిషన్ రాబట్టింది. నిర్మాణాల్లో నిబంధనల అమలుపై ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. ఆనకట్టలకు వాటిల్లిన నష్టం వెనుక కారణాలపై పలు వివరాలను నమోదు చేసింది.
అంచనాలు-రుణాలు-వడ్డీరేట్లు :ఆనకట్టల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ ఫోకస్ పెట్టనుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణాలకు తీసుకున్న రుణాలు, వడ్డీరేట్లపై విచారణ చేపట్టనుంది. పలు బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రుణాలుగా తెచ్చిన నిధుల వ్యయం లక్ష్యం మేరకు జరిగిందా లేదా అనే కోణంలోనూ ఆరా తీయనుంది. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలకు జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నారు.
కమిషన్‌కు అందని విజిలెన్స్ నివేదిక : కాళేశ్వరం ఆనకట్టలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సూచించినప్పటికీ అది ఇంకా అందకపోవడంపై కమిషన్ వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. నివేదిక కోసం మరోమారు లేఖ రాయాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన నివేదికపై ఇప్పటికే అధ్యయనం చేపట్టిన కమిషన్ పలు అంశాలను నిర్ధారించినట్లు తెలిసింది. అవసరమైతే కాగ్ అధికారులను కూడా విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది.